Medak: నేడే సీఎం కేసీఆర్ మెదక్ పర్యటన.. గ్రాండ్ వెల్ కమ్‌కు భారీ ఏర్పాట్లు
మెదక్‌లో సమీకృత కలెక్టరేట్, జిల్లా ఎస్పీ కార్యాలయంతో పాటు బీఆర్ఎస్ భవన్‌ను నేడు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు...
- సమీకృత కలెక్టరేట్, జిల్లా ఎస్పీ కార్యాలయం, జిల్లా బీఆర్ఎస్ భవన్ ప్రారంభం..
- సీఎం రాక కోసం భారీ ఏర్పాట్లు...
- మెరిసిపోతున్న ప్రధాన రహదారులు
- యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాలు
- సీఎస్ఐ మైదానంలో బహిరంగ సభ
- ఐదేళ్ల కు మెదక్ వస్తున్న కేసీఆర్
- గులాబీ మయంగా మారిన మెదక్
దిశ, మెదక్ ప్రతినిధి: మెదక్‌లో సమీకృత కలెక్టరేట్, జిల్లా ఎస్పీ కార్యాలయంతో పాటు బీఆర్ఎస్ భవన్‌ను నేడు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. మెదక్ 1వ వార్డు ఔరంగాబాద్ శివారులో సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం 32 ఎకరాల్లో రూ.70 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేశారు. 2018లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపన శంకుస్థాపన చేశారు. వీటిని నేడు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. మెదక్ రహదారులన్నీ గులాబీ మయంగా మారాయి. సీఎస్ఐ మైదానంలో దాదాపు లక్ష మందితో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇందుకోసం కార్యకర్తలను తరలించేందుకు సన్నాహాలు చేశారు. కలెక్టరేట్ సముదాయంలో 35 శాఖలకు గదులు, జిల్లా అధికారుల కోసం ప్రత్యేక క్వార్టర్స్ నిర్మాణం చేశారు. అత్యాధునిక వసతులతో భవన సముదాయం నిర్మాణం జరిగింది. విశాలమైన ప్రాంగణంలో, పది ఎకరాల్లో గ్రీనరి, పార్క్ ఏర్పాటు చేశారు. ఈ కలెక్టరేట్ రెండు ప్రధాన ద్వారాలు నిర్మాణం చేశారు. శాఖలు విశాలంగా ఉండేలా రెండంతస్తుల నిర్మాణం చేపట్టారు. సీఎం రాక కోసం నిర్మాణం పనులు శరవేగంగా చేపట్టి సుందరంగా ప్రారంభోత్సవానికి జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది.
సువిశాల ప్రాంగణంలో ఎస్పీ కార్యాలయం..
మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయం సువిశాల ప్రాంగణంలో నిర్మాణం జరిగింది. 63 ఎకరాల్లో ఎస్పీ కార్యాలయ సముదాయం నిర్మించారు. మూడంతస్తుల సుందర భవనంలో కింద విభాగంలో 16 విభాగాల్లో ఎస్పీ, ఏ ఎస్పీ గదుల్లో పాటు వారి ఓఎస్డీలు, సీసీలు, పీఆర్‌ఓలకు ప్రత్యేక గదులు నిర్మించారు. స్టోర్స్ ఇంఛార్జి, ఔట్ వార్డులతో పాటు పాస్ పోర్ట్ విచారణ, ఐటీసీ విభాగాలు ఉన్నాయి. వీటితో పాటు రిసెప్షన్, ఫిర్యాదులు కోసం గ్రీవెన్స్ కోసం ప్రత్యేక హాల్ నిర్మించారు. భవన సముదాయం పక్కనే ఎస్పీ రెసిడెన్స్, పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నిర్మాణం చేశారు.
బీఆర్ఎస్ భవన్..
నూతనంగా కలెక్టరేట్ కు సమీపంలో జిల్లా బీఆర్ఎస్ భవన్ ను సుమారు రూ.60 లక్షల వ్యయంతో నిర్మించారు. ప్రతి జిల్లాలో నిర్మించిన విధంగానే ఇక్కడ కూడా జిల్లా పార్టీ కార్యాలయం నిర్మాణం గతంలోనే పూర్తయింది. అయితే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం చేయించాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అలాగే నిలిపి వేశారు. కలెక్టరేట్, ఎస్పీ భవనాలు పూర్తయితే వాటితో పాటు బీఆర్‌ఎస్ భవన్ కూడా ప్రారంభించాలని ఎమ్మెల్యే భావించారు. అన్నట్టుగానే ఇన్నాళ్లకు ప్రారంభానికి సిద్ధం అయింది.
జిల్లా కేంద్రం గులాబీ మయం...
గులాబీ బాస్... రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాక సందర్భంగా మెదక్ పట్టణం గులాబీ మయంగా మారింది. మెదక్ పట్టణ శివారు మంబోజి పల్లి నుంచి కలెక్టర్ వరకు రోడ్డు కు ఇరు వైపులా భారీగా ఆహ్వాన ప్లెక్సీ లు ఏర్పాటు చేస్తారు. పట్టణంలో ఎటు చూసినా భారీ ప్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా ఎన్నికకు ముందు సీఎం పర్యటన ను రాజకీయంగా వాడుకునేందుకు ఎమ్మెల్యే భారీ జన సమీకరణ కోసం ఏర్పాట్లు చేశారు. సీఎస్ఐ మైదానంలో దాదాపు లక్ష మందితో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సీఎం ప్రసంగించేందుకు భారీ స్టేజి ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రజలు కూర్చునేందుకు కుర్చీలు సైతం ఏర్పాటు చేశారు.
కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు...
మెదక్ పర్యటనకు సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా నర్సాపూర్ వైపు నుంచి వస్తున్న సీఎం కు భద్రత ఏర్పాట్ల దృష్ట్యా పట్టణంలో షాపు లు, ఇతర వ్యాపార సంస్థలను బంద్ చేయాలని సూచించారు. జిల్లా పోలీస్‌తో పాటు ఇతర జిల్లాలకు చేసిన పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే బహిరంగ సభ కు వచ్చే వాహనాలకు ఎక్కడివి అక్కడ పార్కింగ్ లు ఏర్పాటు చేశారు..
మెతుకు సీమ ప్రజల చిరకాల స్వప్నం తీరింది..
- ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
జిల్లా ప్రజల చిరకాల కల నెరవేరిందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లాగా పేరు ఉన్న జిల్లా కేంద్రం లేకపోవడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదని, కానీ సీఎం కేసీఆర్ వల్లే జిల్లా కేంద్రం కల నెరవేరిందని అన్నారు. అన్ని శాఖ లు ఒకే చోట ఉండేలా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు నిర్మించడంతో ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుందని అన్నారు. సీఎం బహిరంగ సభ కు జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.