అక్రమ రెస్టారెంట్‌కు లైసెన్సులు..సంబంధిత శాఖల సంపూర్ణ సహకారం

తిలా పాపం తల పిడికెడు అన్న చందంగా తయారైంది

Update: 2024-09-21 10:08 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : తిలా పాపం తల పిడికెడు అన్న చందంగా తయారైంది కొందరి ప్రభుత్వ అధికారుల తీరు. అన్నీ సక్రమంగా ఉన్న ఫైళ్ల సమస్యలను పరిష్కరించడంలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నిర్లక్ష్యంగా వ్యవహారిస్తారు. కానీ భారీగా ముడుపు లిస్తే మాత్రం తిమ్మిని బొమ్మి చేసి అడ్డదారుల్లో చేయకూడని పనులు చకచకా పూర్తి చేస్తారు.ఇదే తరహాలో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఆర్మీ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఓ హోటల్ కి లైసెన్స్ లు జారీ చేసి తమ పని తనాన్ని చాటుకున్నారు. సాధారణంగా ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనులు చేయాల్సి ఉండగా..ఆ నిబంధనలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అందినకాడికి దండుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

వంటిల్లు అక్రమం..

కంటోన్మెంట్ ఓల్డ్ గ్రాండ్ (ఆర్మీ) బంగ్లా స్థలంలో వ్యాపారం చేయడం నిషిద్ధం.అయితే డిఫెన్స్ స్థలంలో బోయిన్ పల్లి చెక్ పోస్ట్ వద్ద ఇటీవల దొంతి భరత్ రెడ్డి వంటిల్లు రెస్టారెంట్ ను ఓపెన్ చేశారు. ఈ రెస్టారెంట్ స్థానంలోనే గతంలో ప్రియదర్శిని హోటల్ ఉండేది. అయితే ఆర్మీ స్థలంలో హోటళ్లు, రెస్టారెంట్లు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని గతంలో అప్పటి సీఈఓ సుజాత గుప్తా ఆ హోటల్ భవనాన్ని నేలమట్టం చేశారు.దీంతో ఆ ప్రాంతానికి ల్యాండ్ మార్క్ గా మారిన ప్రియదర్శిని హోటల్ కనుమరుగైంది. అయితే కంటోన్మెంట్ కూల్చేసిన భవనానికి బోర్డు అధికారుల సహకారంతో మరమ్మతులు చకచకా జరిగిపోయాయి. కూల్చేసిన ప్రియదర్శిని స్థలంలో వంటిల్లు రెస్టారెంట్ కొత్తగా ఏర్పడింది.

శాఖల సంపూర్ణ సహకారం..

నిబంధనలకు విరుద్ధంగా ఆర్మీ స్థలంలో ఏర్పాటు చేసిన వంటిల్లు రెస్టారెంట్ కు కార్మిక, ఫుడ్ సేఫ్టీ, విద్యుత్ శాఖలు పూర్తి సహకారాన్ని అందించారు. మేడ్చల్ జిల్లా కార్మిక శాఖ అధికారులు ఆ హోటల్ కు లేబర్ లైసెన్స్ ఇవ్వగా, అల్వాల్ జీహెచ్ఎంసీ సర్కిల్ ఫుడ్ సేప్టీ శాఖ అధికారులు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ జారీ చేశారు. అయితే కంటోన్మెంట్ ప్రాంతం హైదరాబాద్ జిల్లాలో ఉండగా, మేడ్చల్ జిల్లా కార్మిక శాఖ అధికారి యాదయ్య లేబర్ లైసెన్స్ జారీ చేయడం విమర్శలకు దారి తీస్తున్నాయి. అదేవిధంగా కంటోన్మెంట్ ప్రాంతంతో సంబంధంలేని అల్వాల్ జీహెచ్ఎంసీ ఫుడ్ సేప్టీ అధికారులు లైసెన్స్ ఇవ్వడం గమనార్హం. ఈ విషయమై అల్వాల్ సర్కిల్ ఫుడ్ సేప్టీ అధికారి లక్ష్మీకాంత్ ను ‘దిశ’ ప్రతినిధి ఓ కస్టమర్ మాదిరిగా ఫోన్ చేసి బోయిన్ పల్లి లో లైసెన్స్ కావాలని కోరగా, బోయిన్ పల్లి లో మేము లైసెన్స్ ఇవ్వమని స్పష్టంచేశారు. అయితే తాను ‘దిశ’ ప్రతినిధిని అని బోయిన్ పల్లిలో వంటిల్లు రెస్టారెంట్ కి లైసెన్స్ ఎలా జారీ చేశారని..?,ప్రశ్నిస్తూ ఆ లైసెన్స్ కాఫీ అతనికి వాట్సప్ ద్వారా పంపివ్వగా, ఆ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

అక్రమంగా విద్యుత్ మీటర్..

ఆర్మీ స్థలంలో వ్యాపార, వాణిజ్య అవసరాలకు విద్యుత్ మీటర్లు మంజూరు చేయడం లేదు.కంటోన్మెంట్ మూడో వార్డు పరిధిలోని మిడ్ ఫోర్ట్ గుడిసెలలో వందలాది కుటుంబాలకు డిఫెన్స్ స్థలంలో ఉన్నందున విద్యుత్ మీటర్లు ఇవ్వక ఇబ్బందులు పడుతున్నారు. కానీ అమ్యామ్యాలకు ఆశపడి బోయిన్ పల్లి విద్యుత్ శాఖ అధికారులు ఏకంగా ఆర్మీ స్థలంలో ఏర్పాటు చేసిన వంటిల్లు రెస్టారెంట్ కు విద్యుత్ మీటర్ మంజూరు చేయడం గమనార్హం. అక్రమంగా మీటర్లు మంజూరు ఇచ్చినందుకు ఒక్కో విద్యుత్ మీటర్ కు రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.లేబర్ లైసెన్స్, విద్యుత్ మీటర్ల మంజూరుపై సంబంధిత అధికారుల వివరణ కోరేందుకు ‘దిశ’ ప్రయత్నించిగా అందుబాటులో లేరని సమాధానం వస్తుంది. ఇప్పటికైనా ఈ అక్రమ దందాపై ఉన్నతాధికారులు విచారణ జరిపించి ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం మరీ..


Similar News