మైసమ్మ చెరువును మింగేస్తున్న భూ బకాసురులు

Update: 2024-08-25 11:15 GMT

దిశ, కూకట్​పల్లి : భూ బకాసురులు ఏకంగా చెరువునే మింగేస్తున్నారు. ఒకప్పుడు తాగునీరు, సాగునీరు అందించిన వందల ఎకరాల చెరువును పూర్తిగా మింగేస్తున్నారు. 149 ఎకరాల సువిశీలమైన చెరువు కబ్జాకు గురై నేడు 83 ఎకరాలకు చేరింది. అందులోను కేవలం 60 ఎకరాల వరకు మురుగు నీటితో కంపు కొడుతుంది. కూకట్​పల్లి నియోజకవర్గ పరిధి మూసాపేట్​ గ్రామం పరిధిలోని మైసమ్మ చెరువు మూసాపేట్​, అల్లాపూర్​ గ్రామాల ప్రజలకు తాగునీరు, సాగు నీరును అందించించింది. నగరంలో తెలంగాణ ప్రభుత్వం హైడ్రా సంస్థను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన కార్యచరణతో ముందుకు వెళుతుండటంతో మైసమ్మ చెరువు తాజాగా మళ్లి వార్తలోకి వచ్చింది. ఈ క్రమంలో నెల రోజుల వ్యవధిలో హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ మైసమ్మ చెరువును ఇప్పటికి రెండు సార్లు సందర్శించి చెరువు వివరాలు, కబ్జా జరిగిన విషయాలపై ఆరా తీశారు.


మూసాపేట్​ గ్రామ పరిధిలోని ప్రభుత్వ సర్వే నంబర్​ 893లో 84.2 ఎకరాలు ఉండగా, మిగిలిన ప్రైవేటు సర్వే నంబర్​లు 892 నుంచి మొదలు కుని.. 907 వరకు.. 40 నుంచి మొదలుకుని.. 74 దాకా.. 92 నుంచి మొదలుకుని 99 దాకా.. 103 నుంచి 107 సర్వే నంబర్​లలో మొత్తం 149 ఎకరాల విస్తీర్ణంలో మైసమ్మ చెరువు ఉంటుందని ఇరిగేషన్​ ఏఈ లక్ష్మినారాయణ తెలిపారు.

ఒక్కొక్కరిగా ఎంట్రీ ఇచ్చి..

ప్రభుత్వ, ప్రైవేటు సర్వే నంబర్​లు కలుపుకుని 149 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మైసమ్మ చెరువు ప్రస్తుతం పూర్తిగా కబ్జా కోరల్లో చిక్కుకుని కేవలం 83 ఎకరాల వరకు మాత్రమే మిగిలి ఉంది. మిగిలిన 83 ఎకరాలలో 60 ఎకరాలలో చెరువులో నీళ్లు ఉండగా మిగిలిన ప్రాంతం మట్టితో నిండి ఉంది. చెరువుకు మరో వైపు నుంచి రాజీవ్​గాంధీనగర్​, సఫ్దర్​నగర్​ కాలనీ నుంచి చెరువులో మట్టి నింపుకుంటూ.. సుమారు 20 ఎకరాల వరకు చెరువును కబ్జా చేసి సుమారు 3 వేల ఇండ్లు నిర్మించినట్టు ఇరిగేషన్​ అధికారులు గుర్తించి హైడ్రా సంస్థకు నివేదికను సైతం అందించారు. ఇదిలా ఉంటే చెరువును ధోభిఘాట్​ వైపు నుంచి కొంత మంది భూమి తమదని చెప్పుకుంటూ రాత్రికి రాత్రే మట్టితో నింపి చదును చేశారు. మరో వైపు ఇంకొకరు చెరువులో కడీలు పాతి హద్దులు ఏర్పాటు చేసుకున్నారు.

మట్టి నింపిన హానర్​ నిర్మాణ సంస్థపై కేసు..

మైసమ్మ చెరువులో ధోభిఘట్​ వైపు నుంచి స్థానికంగా ఉన్న కొంత మంది మట్టిని నింపడం ప్రారంభించారు. ఈ క్రమంలో మైసమ్మ చెరువుకు అతి సమీపంలో ఉన్న హనర్​ నిర్మాణ సంస్థ తమ సంస్థలో సెల్లార్​ కోసం తవ్విన మట్టిని సుమారు 2 వందల టిప్పర్లతో చెరువులో పోశారు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్​ అధికారి లక్ష్మినారాయణ ఫిబ్రవరి 1వ తేదిన కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు హానర్​ సంస్థతో పాటు శికుమర్​, శ్రీకాంత్​లపై ​ఎఫ్​ఐఆర్​ నంబర్​ 126/2024, ఐపీసీ సెక్షన్​లు 447, 427, 3 పిడిపిపిఏ, 35 వాల్టా చట్టం కింద కేసు నమోదు చేశారు.

మైసమ్మ చెరువును సందర్శించిన హైడ్రా కమిషనర్..

నగరంలో కబ్జాకు గురైన చెరువుల చిట్టా తమ వద్ద ఉందని ఇప్పటికే ప్రకటించిన హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ నెల వ్యవధిలో మైసమ్మ చెరువును రెండు సార్లు సందర్శించి ఇరిగేషన్​, రెవెన్యు అధికారుల నుంచి కబ్జాకు సంబంధించిన విషయాలపై ఆరా తీశారు.

రంగనాథ్​ ఎంట్రీతో కబ్జా రాయుళ్లలో గుబులు..

హైడ్రా కమిషనర్​ మైసమ్మ చెరువును సందర్శించడం, రాజీవ్​గాంధీనగర్​, సఫ్దర్​నగర్​లో జరిగిన కబ్జాల పర్వంపై ఆరతీయడం, మైసమ్మ చెరువు కబ్జాపై దర్యాప్తు ప్రారంభించడంతో చెరువులో కబ్జాలకు పాల్పడిన వారు, చెరువులో మా భూమి ఉందంటు కడీలు పాతుకున్న వారు సైతం భయం గుప్పిట్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎన్ని కూల్చి వేతలు జరుగాయో అన్న భయంతో కబ్జా దారులు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.


Similar News