రానున్నది మోదీ ప్రభుత్వమే.. మల్కాజిగిరిలో బీజేపీ గెలుపు ఖాయం : ఈటల

దేశంలో లోక్‌సభలో 400 సీట్లు గెలవడం ఖాయమని, అందులో

Update: 2024-04-05 11:45 GMT

దిశ, మల్కాజిగిరి : దేశంలో లోక్‌సభలో 400 సీట్లు గెలవడం ఖాయమని, అందులో మల్కాజిగిరి గెలుపు తథ్యమని మల్కాజిగిరి బీజేపీ పార్లమెంటు అభ్యర్థి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల అభ్యర్థులు గత ఐదేళ్లుగా ఇప్పటి వరకూ ఈ ప్రాంతాలలో కనిపించలేదన్నారు. మల్కాజిగిరి సర్కిల్ గౌతంనగర్ లో గురువారం సాయంత్రం నిర్వహించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేసినవేనన్నారు. ప్రధాని మోదీ పేదల కష్టాలు స్వయంగా అనుభవించారని, మన దేశం అభివృద్ధిలో చంద్రున్ని తాకుతున్నా, దేశ మహిళలకు కనీసం టాయిలెట్లు కూడా లేని పరిస్థితి ప్రధానిని కలచి వేసిందన్నారు. వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి దేశవ్యాప్తంగా మహిళలకు స్వచ్ఛభారత్ మిషన్ పేరుతో టాయిలెట్లు కట్టించారన్నారు.

పేదలకు ఎలాంటి అకౌంట్ లేని స్థితి నుండి ప్రతీ ఒక్కరికీ ఉచితంగా ధన్ జన యోజన ద్వారా జీరో బ్యాంక్ అకౌంట్ తెరిపించిన ఘనత మోదీ దేనన్నారు. నేడు ప్రతి చిన్న వ్యాపారి వద్దా ఫోన్ పే, గూగుల్ పే వంటివి ఉన్నాయంటే అది మోదీ చలవేననీ, నేడు పెద్ద పెద్ద దేశాలైన అమెరికా వంటి దేశాలు సైతం డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలు చేయాలంటే పదేళ్ళు పట్టింది. కానీ భారత్‌లో కేవలం మూడేళ్లలో దాన్ని సాధించారన్నారు. అయోధ్య శ్రీరామ మందిరం ధ్వంసం తర్వాత తిరిగి నిర్మించబడుతుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదనీ, అలాంటి అసాధ్యమైన పనిని కేవలం మూడేళ్లలో సాధించారన్నారు. నేడు ప్రపంచంలో బలమైన నేత ఎవరనే సర్వే చేస్తే భారత్ ప్రధాని నరేంద్రమోదీ పేరే ప్రముఖంగా వినిపిస్తోందన్నారు. నేడు మేకిన్ ఇండియా పేరుతో మొబైల్స్ మొదలుకొని, ఆపరేషన్ పరికరాలు, మిస్సైల్స్, రాకెట్లతో సహా భారత్‌లో రూపొందించబడుతున్నాయి. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు వేల సంఖ్యలో మరణిస్తుంటే, ఇతర దేశాల నేతలు మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ ప్రధాని మోదీ భారత ప్రజల్లో ధైర్యం నింపి, ప్రజలందరికీ ఉచితంగా ఆహారం అందించారు.

దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించారని తెలిపారు. కరోనా నుండి వేగంగా కోలుకున్న దేశంగా భారత్‌ అగ్రస్థానంలో నిలిచిందనీ, అందుకే మన పార్లమెంట్ నియోజక వర్గంలో 38 లక్షల మంది ప్రజలు ఆలోచించి, మల్కాజ్‌గిరికి కావలసిన సకల సౌకర్యాలు కేంద్రప్రభుత్వం ద్వారా సాధిస్తానన్నారు. ఇతర దేశాల నుండి కూడా ప్రధాని మోదీని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కానీ, ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్ధం లో కూడా ప్రధాని మోదీ సలహాలను కోరుకుంటున్నారు వారు. మొట్టమొదటి సారి యూఏఈలో హిందూ దేవాలయాన్ని ఏర్పాటు చేసింది ప్రధాని మోడీయేనని గమనించి ర పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని బలపర్చాలని కోరారు. కార్యక్రమంలో మల్కాజిగిరి సర్కిల్ బీజేపీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రచారంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలపై ఓటర్లకు అవగాహన కల్పించారు.


Similar News