సర్కారు భూమిలో ‘ఇన్కార్’భవంతులు
గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో చెరువులు, కుంటలు,వరద కాలువలఉ, విలువైన ప్రభుత్వ భూములు తీవ్ర విధ్వంసానికి గురయ్యాయి.
దిశ, సంగారెడ్డి బ్యూరో/పటాన్ చెరు : గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో చెరువులు, కుంటలు,వరద కాలువలఉ, విలువైన ప్రభుత్వ భూములు తీవ్ర విధ్వంసానికి గురయ్యాయి. వడ్డించే వాడు మనవాడు ఉంటే తిండికి లోటు లేదన్నట్లు అడ్డగోలుగా ప్రభుత్వ భూముల్ని ఫలహారంగా మెసేశారు. యువతకు ఉపాధి కల్పన కోసం రైతుల దగ్గర నుంచి పరిశ్రమల స్థాపనకు సేకరించిన భూములను అపార్టుమెంట్ల నిర్మాణం కోసం అప్పనంగా బడా రియల్టర్లకు కట్టబెట్టారు. ఆసియాలోనే రెండో అతి పెద్ద పారిశ్రామిక ప్రాంతంగా పేరున్న పటాన్ చెరు ప్రాంతంలో విలువైన పారిశ్రామిక భూములు అన్యాక్రాంతమవుతున్నాయి.
గత ప్రభుత్వంలోని పెద్దల అండదండలతో టీఎస్ఐఐసీ భూముల్ని ఇన్కార్ అనే నిర్మాణరంగ సంస్థకు కట్టబెట్టారు. ఈ నిర్మాణ సంస్థలు గత ప్రభుత్వానికి చెందిన పెద్దల పెట్టుబడులతో పాటు వారి అండదండలు ఉండడంతో ఇన్కార్ సంస్థ ఇన్కార్ లేక్ సిటీ పేరుతో టీఎస్ఐఐసీ కి చెందిన భూముల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలను మొదలుపెట్టారు. సర్వే నంబర్లు 691 నుంచి 715 వరకు 730,731,732, 733,734,735,736,737 లలో కొంత భూముల్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకుని సుమారు 32 ఎకరాలలో అపార్టుమెంట్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ భూములు పటాన్ చెరు సాకి చెరువును ఆనుకుని ఉండడంతో లేక్ వ్యూ పేరుతో 3 టవర్లతో 23 ఫ్లోర్లు, నాలుగు సెల్లార్లతో అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణలలో ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడంతో పాటు వరద కాలువలు, పంట కాలువలను పూర్తిగా కనుమరుగు చేసి ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారు.
అనుకున్నారు.. అప్పనంగా కట్టబెట్టేశారు..
పటాన్ చెరు సాకి చెరువు కింద పైన పేర్కొన్న సర్వే నంబర్లలో 65 ఎకరాల భూమిని టీజీ ఐఐసీ (అప్పటి ఏపీఐఐసీ) వోల్టాస్ కంపెనీకి కట్టబెట్టింది. యువతకు ఉద్యోగ కల్పన కోసం అప్పటి ప్రభుత్వం రైతుల నుంచి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చి అతి తక్కువ ధరకు భూములను సేకరించింది. చాలా సంవత్సరాల పాటు వోల్టాస్ పరిశ్రమ ఈ భూముల్లో వారి కార్యకలపాలని నిర్వహించి పరిశ్రమను నడిపించారు.
ఆ తర్వాత కంపెనీని లాకౌట్ చేసి గోద్రెజ్ సంస్థకు భూమిని బదలాయించారు. ఆ తర్వాత గోద్రెజ్ సంస్థ ప్రభుత్వ పెద్దల అండదండలతో ఎటువంటి నియమ నిబంధనలను పాటించకుండా ఇన్కార్ సంస్థకు భూముల్ని బదలయించింది. ఈ తతంగమంతా పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు పంగణామం పెడుతూ అక్రమంగా భూ బదలాయింపు వ్యవహారం నడిచింది. ఈ భూములు జాతీయ రహదారిని ఆనుకుని ఉండడంతోపాటు సాటి చెరువు పక్కనే ఉండడంతో ఈ భూముల పై కన్నేసిన పెద్దలు అప్పటి ప్రభుత్వ పెద్దల భాగస్వామ్యంతో పాటు పెట్టుబడులతో ఇన్కార్ సంస్థకు అప్పనంగా భూముల్ని కట్టబెట్టారు.
రాత్రికి రాత్రే జీవోలు
రైతుల దగ్గర నుంచి సేకరించి పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో గృహ నిర్మాణాలకు సంబంధించిన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరు. ఈ భూముల్లో కేవలం ఉద్యోగ కల్పనకు సంబంధించిన ఐటీ టవర్స్, గోడౌన్స్, పరిశ్రమలు స్థాపించడానికి మాత్రమే అవకాశం ఉంది. అయితే అప్పటి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో ఈ వ్యవహారం జరగడంతో పూర్తిగా నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి రాత్రికి రాత్రే ప్రత్యేక జీవోలను తీసుకువచ్చి బహుళ అంతస్తుల నిర్మాణాలకు అవకాశం కల్పించింది.
ఈ జీవోల జారీలో సైతం పెద్ద ఎత్తున అక్రమాలు అవినీతి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. జీవో జారీ చేసిన తర్వాత సైతం సదరు నిర్మాణ సంస్థ అనేక అక్రమాలకు పాల్పడి ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పూర్తిగా విస్మరించింది. అయినా ప్రభుత్వ పెద్దల పెట్టుబడులు ఉండడంతో అప్పటి ప్రభుత్వం ఈ నిర్మాణ సంస్థ ఎన్ని రకాల అక్రమాలకు పాల్పడ్డా చూసీచూడనట్లు వదిలేసిందన్న ఆరోపణలు ఉన్నాయి.
భూ బదలాయింపు మతలబు ఏంటి..?
ఇన్కార్ లేక్ సిటీ నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతం గతంలో రైతుల దగ్గర నుంచి పరిశ్రమల స్థాపన కోసం సేకరించిన భూములు, దానికి తోడు గతంలో పరిశ్రమలకు సేకరించిన ఈ భూములన్నీ టీజీఐఐసీ కంట్రోల్ లో ఉన్నాయి. ఈ నిర్మాణ పనులు ప్రారంభించిన మొదట్లో రైతులు ఆందోళన చేయడంతో పాటు స్థానికులు ఈ నిర్మాణాలను వ్యతిరేకించడంతో ఈ భూములన్నీ టీజీఐఐసీకి సంబంధించినవని. ఆ భూముల్లో సదరు సంస్థ బోర్డులను సైతం ఏర్పాటు చేసింది. నిర్మాణం జరుగుతున్న భూములన్నీ తమ ఆధీనంలోనే ఉన్నట్లు టీజీఐఐసీ లిఖితపూర్వకంగా సైతం సమాధానమిచ్చింది.
పత్రికల్లో కథనాలు, ఫిర్యాదులు వచ్చిన చాలా సార్లు టీజీఐఐసీ అధికారులు సదరు నిర్మాణ పనులు ఆపడానికి ప్రయత్నాలు చేశారు. ఆ భూములను తమ ఆధీనంలో ఉన్నాయని వాటిలో ఎటువంటి రిజిస్ట్రేషన్లు చేయడానికి వీలులేదని 2021లో టీజీఐఐసీ సంస్థ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి లేఖ రాశారు. అయినా ప్రభుత్వ పెద్దల అండదండలతో ఇష్టారీతిగా ఆ నిర్మాణ సంస్థ తన నిర్మాణ పనులన్నీ పూర్తి చేస్తూ వస్తుంది. అయితే టీజేఏసీ పరిధిలో ఉన్న భూముల బదలాయింపు ఇన్కార్ సంస్థకి ఏ ప్రతిపాదికన జరిగింది..? ప్రస్తుతం ధరణి రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమిగా చూపిస్తూ నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో సదరు నిర్మాణ సంస్థకి అనుమతులు ఎలా వచ్చాయన్న విషయాన్ని మిలియన్ డాలర్ ప్రశ్నగా చెప్పుకోవచ్చు.
గత ప్రభుత్వ పెద్దల అండదండలతో నిబంధనలకు తీలోదకాలు ఇచ్చి ప్రభుత్వ భూముల్లో నిర్మాణం చేయడమే కాకుండా ఇష్టా రీతిగా వరద కాలువలు, పంట కాలువలను మళ్లించి ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్న ఇన్కార్ సంస్థపై ఇప్పటి ప్రభుత్వం దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి ఈ అక్రమ భూ బదలాయింపు బాగోతంపై సమగ్ర విచారణ జరిపి నిజా నిజాలను నిర్ధారించి నిర్మాణ అనుమతులు మొత్తం రద్దుచేసి ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.