ప్రపంచానికే గర్వకారణంగా భారత్… : ఈటల

టెక్నాలజీ కోసం జపాన్, చైనా దేశాలపై ఆధారపడే భారత్ నేడు

Update: 2024-04-08 08:35 GMT

దిశ,మేడ్చల్ బ్యూరో : టెక్నాలజీ కోసం జపాన్, చైనా దేశాలపై ఆధారపడే భారత్ నేడు మేకిన్ ఇండియా నినాదంతో ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రపంచంలోనే రెండో స్థానానికి ఎదిగిందని మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు.అమెరికా లాంటి సంపన్న దేశాలలోనే పూర్తి స్థాయిలో డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసేందుకు పదేళ్ల కాలం పట్టిందని, కానీ నిరక్షరాస్యత అధికంగా ఉన్న మన దేశంలో కేవలం మూడేళ్లలోనే డిజిటల్ వినియోగం ఎంతో మెరుగ్గా ఉందన్నారు. సోమవారం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ మారేడ్ పల్లి లో ఈటల అల్పాహార విందు లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రజల ప్రాణాలకు రక్షణే లేదన్నారు. ఎప్పుడు ఏ బాంబు పేలుతుందో ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో , బయటకు వెళ్తే ఇంటికి తిరిగొస్తామో, లేదో నని బిక్కుబిక్కుమంటూ జీవించేవారమన్నారు. ఎప్పుడూ జనంతో కిటకిటలాడే లుంబినీ పార్కు, గోకులు ఛాట్, దిల్‌సుఖ్‌నగర్ వంటి ప్రాంతాలలో బాంబులు వేసి, అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

కానీ నేడు ప్రధాని మోదీ పాలనలో తెలంగాణ ప్రశాంతంగా నిద్రపోతోందని ఈటల అన్నారు. గతంలో జమ్ముకాశ్మీర్‌ మరో పాకిస్తాన్‌లా ఉండేదన్నారు. అక్కడ జాతీయ జెండాను ఎగరవేయాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవలసిందేనని తెలిపారు. కానీ నేడు మన కాశ్మీర్ కూడా భారత్ లో అంతర్భాగమేనంటూ ఒకే దేశం ఒకే చట్టం తెచ్చి అక్కడ ప్రశాంతతను ప్రధాని నెలకొల్పారని తెలిపారు.నేడు రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయి. అమెరికా, రష్యా వంటి దేశాలు వారి పార్లమెంట్ లో మన ప్రధానికి ఘన స్వాగతం పలుకుతున్నారు.ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో భారతీయ విద్యార్థులు చిక్కుకుపోతే, వారిని క్షేమంగా భారత్‌కు ప్రత్యేక విమానాలలో తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోదీదేనని తెలిపారు. ఆయా ప్రభుత్వాధినేతలతో మాట్లాడి యుద్ధానికే విరామం ఇప్పించి, భారతీయులనే కాక అక్కడి యూనివర్సిటీలలో విద్యార్థులందరినీ క్షేమంగా ఆయా దేశాలకు చేర్చిన ఘతన మన ప్రధానికే దక్కిందన్నారు.

22 ఏళ్లుగా రాజకీయ పోరాటమే..

తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్నా, 22 సంవత్సరాలుగా రాజకీయంగా మీకందరికీ దగ్గరగా ఉన్నాను. హెల్త్ మినిస్టర్‌గా ఉన్న కాలంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ మహేంద్ర హిల్స్ ప్రాంతానికి ఆనాడు నేను వచ్చాను. నాకు ఈ విషయం చాలా గుర్తు. ఎందుకంటే ఇక్కడ మొట్టమొదటి కరోనా పేషెంట్ దుబాయ్ నుండి బెంగళూరుకి, అక్కడ నుండి ఈ మహేంద్ర హిల్స్ కు వచ్చాడు. అతని వద్దకు వెళ్లడానికి అందరూ భయపడి తలుపులు వేసుకున్నారు. కానీ ఆరోగ్య మంత్రిగా నా బాధ్యత విస్మరించకుండా నేను ఆయన వద్దకు వెళ్లి ఆసుపత్రిలో చేర్పించి అతి దగ్గరగా పర్యవేక్షించాను. అప్పట్లో కరోనా పేషెంట్ వద్దకు వెళ్లిన మొదటి మంత్రిని నేనే కావచ్చునని ఈటల గత అనుభవాలను పంచుకున్నారు.

కాంగ్రెస్ ధైర్యం చేయలేక..

మన దేశంలో దేవాలయాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో తెలుసు. దేవాలయాలను మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా చెప్పుకుంటాం. అలాంటి దేవాలయాలను విదేశీ పాలకుల క్రూర చర్యల వల్ల దేవాలయాలను ధ్వంసం చేశారు. రామాయణ ఇతిహాసంలో శ్రీరామచంద్రుని జన్మభూమి గా చెప్పుకునే అయోధ్య దేవాలయాన్ని మొఘల్ పాలకుల కాలంలో ధ్వంసం చేశారు. అప్పటి నుంచి మనకు స్వాతంత్య్రం వచ్చాక కూడా కాంగ్రెస్ పాలకులు గుడి కట్టే ధైర్యం చేయలేకపోయారు. కానీ ప్రధాని మోదీ ఎన్నాళ్లుగానో హిందువుల కలగా మిగిలిన అయోధ్య రామాలయాన్ని ప్రపంచ స్థాయిలో గొప్పగా కట్టించి ప్రారంభించారని ఈటల తెలియజేశారు. కార్యక్రమంలో మారేడ్ పల్లి కార్పొరేటర్ కొంతం దీపిక, బీజేపీ నాయకులు పిట్ల నగేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.


Similar News