మరో నాలుగు నెలలే.. ఇచ్చుకో..స్పీడ్‌గా కట్టుకో.. జీహెచ్ఎంసీలో నయా దందా..

మేడిపల్లి మండలం పీర్జాదిగూడ లో అధికారం మారిన అక్రమ నిర్మాణాలు

Update: 2024-09-14 12:40 GMT

దిశ,మేడిపల్లి: మేడిపల్లి మండలం పీర్జాదిగూడ లో అధికారం మారిన అక్రమ నిర్మాణాలు మాత్రం ఆగలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. కార్పొరేషన్ లో పార్టీ, మేయర్ మారారు తప్ప కార్పోరేటర్లు మారలేదు , దీనికి తోడు కొత్తగా కార్పొరేషన్ మరో నాలుగు నెలల్లో జీహెచ్ఎంసీ లో విలీనం కాబోతుండటంతో ఇచ్చుకో స్పీడ్ గా కట్టుకో... అంటు కొత్త దందా నడిపిస్తున్నారు.ఓక్కో కార్పొరేషన్ కి ఒక్కో విధమైన కండీషన్లు. ప్రతి కార్పొరేషన్ లో అక్రమ నిర్మాణాలు సాగుతునే ఉన్నాయి. స్థానికులు పిర్యాదులు చేస్తూనే ఉన్నారు. మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. అధికారులు తనిఖీలు చేస్తూనే ఉన్నారు. అనుమతులు ఒకలా తెచ్చుకుని నిర్మాణాలు మరోలా నిర్మిస్తునే ఉన్నారు. కొన్ని కార్పొరేషన్లలో బహుళ అంతస్థుల నిర్మాణాలు చూస్తే ఇక్కడి అధికారుల తీరు అర్థమవుతుంది.

బహుళ అంతస్తుల భవనాల చుట్టూ ఫైర్ ఇంజన్ తిరిగే విధంగా స్థలం వదిలి నిర్మించాలి. కానీ పీర్జాదిగూడలో ఇలాంటి అపార్ట్మెంట్ ఎన్ని ఉన్నాయో వేళ్ళ పై లెక్కించవచ్చు..అంటే మిగిలినివన్ని అక్రమమే అని చెప్పుకోవచ్చు. పీర్జాదిగూడ 3 వ డివిజన్ లో వింత ఏమిటంటే రెండు బహుళ అంతస్థుల నిర్మాణాలు పక్కపక్కనే జానడు సంధు కూడా లేకుండా నిర్మిస్తున్నారు. ఏమైన అనుకోని ప్రమాదాలు జరిగితే ఆస్తినష్టం తో పాటు ప్రాణనష్టం జరిగితే బాద్యులు ఎవరవుతారు?.. మరికొన్ని కార్పొరేషన్లలో 300 గజాల లోనే బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు.

సిబ్బంది తీరుతో కమిషనర్ కి విసుగు...

పిర్జాదిగూడ కమీషనర్ చాలా అనుభవం కలిగిన కమిషనర్. ఎన్నో ధీటైన ప్రాంతాల్లో చేసి వచ్చిన అనుభవం ఆయనకే సొంతం. కానీ పీర్జాదిగూడకు వచ్చేసరికి అసహనానికి గురవుతున్నారు. వచ్చినప్పటినుండి అయిష్టంగానే విధులు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు టీపీఓ గా వచ్చినవారు వచ్చినట్టే బదిలీ పెట్టుకుని మరి వెళ్ళిపోతున్నారు. కింది స్థాయి సిబ్బందిని నిర్మాణాల వద్దకు పంపిస్తే వారే ఓనర్ తో రేటు మాట్లాడుకుని వస్తున్నారు. ఈమద్య కాలంలో ఇలా కొందరి ఉద్యోగులను కూడా విధుల నుంచి తొలగించారని సమాచారం. ప్రతీదీ తానే చూసుకోవాలంటే ఇటు కోర్టు పనులు, అటు నాయకుల పనులు అంటూ సమయం గడిచిపోతుంది.

ఇంకా సమస్యలు అని వచ్చే వారికి సమయం కూడా ఇవ్వలేని బిజి షెడ్యూల్ లో కమిషనర్ ఉన్నారు. కొన్ని నిర్మాణాలకు నోటీసులు ఇవ్వడం తప్ప చర్యలు చేపట్టలేకపోతున్నారు. అటు నాయకులు పిర్యాదులు, ఇటు మీడియాలో అక్రమ నిర్మాణాలపై కథనాలు ఎంత మందికి సమాధానం చెప్పాలంటూ ఆయన వద్దకు వెళ్లిన వారిపై గుస్సాయిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ లో ఆయనొక్కడే అందరు డిప్యూటేషన్ లోనే ఉన్నారు. దీంతో సమస్యలను పరిష్కరించాలేక పోతున్నారు. పూర్తి స్థాయి సిబ్బంది ఉంటేనే కానీ ఇలాంటి కార్పోరేషన్లలలో నెగ్గలేరు.

మరో నాలుగు నెలలు మాత్రమే గడువు..

కొత్త అధికార నాయకులకు మరో నాలుగు నెలలే గడువు ఉంది. తర్వాత జీహెచ్ఎంసీ లో విలీనం కానుండటంతో అప్పటి వరకు చూసి చూడనట్లు అందరూ ఉంటున్నారు. ఈలోగా నూతన పార్టీ ఎన్నో సవాళ్లు అధిగమించాలి, కార్పోరేటర్లు అధికారులు, నాయకులు అందరూ నోట ఇప్పుడు ఒకటే మాట మరెప్పుడు ఇలా ఛాన్స్ రాదు. అన్ని నేనే చూసుకుంటా అంటూ హమీలిస్తు పని కానిచ్చేస్తున్నారు. జీహెచ్ఎంసీ లో విలీనం అయిన తర్వాత ఎన్ని కండిషన్లు ఉంటాయె..?. ఎంత ఖర్చు అవుతుందో..?. ఎవరెవరి చుట్టూ ప్రదక్షిణలు చెయాలో..?. ఆలోచిస్తే ఇప్పుడే నిర్మాణాలు కానిచ్చేసి అని ఆలోచించి ఉన్న వాటిని కూల్చి మరీ కొత్తగా నిర్మిస్తున్నారు. దీంతో కార్పొరేషన్ లో జోరుగా నిర్మాణాలు పెరిగింది. చివరి సమయం ఎవరూ పట్టించుకోరని దీమాతో ఒకరిని చూసి ఒకరు నిర్మాణాలు చేపడుతున్నారు.

ఇంతకీ ఎవరికి నష్టం..

ఎటు చూసిన ప్రభుత్వానికే నష్టం వాటిల్లనుంది. జీహెచ్ఎంసీ లో విలీనం కానున్న కార్పొరేషన్లలో నిర్మాణాల జోరు చూస్తుంటే ఈ నాలుగు నెలల్లోనే కోట్లల్లో ప్రభుత్వానికి గండి పడనుంది.అందరూ చూసి చూడనట్టు వదిలేస్తే ప్రభుత్వ ఖజానా ఎలా పెరుగుతుంది. అసలే చిన్న కార్పొరేషన్ లో నిధులు ఎక్కువ ఉన్నాయనే విలీనం చేస్తుంటే విలీన సమయానికి అందరూ కలిసి జీరో నిధులు చూపించెటట్లు ఉన్నారు. జోరుగా సాగుతున్న నిర్మాణాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తే తప్ప కట్టడాలను అరికట్టాలేరని అనుభవజ్ఞులు తెలుపుతున్నారు.


Similar News