నాలాలపై అక్రమ నిర్మాణాలు..కుండపోత వర్షాలతో వెలుగులోకి వస్తున్న వైనం

ఇరిగేషన్ శాఖ అధికారుల అవినీతికి అంతులేకుండా పోయింది.

Update: 2024-09-04 10:29 GMT

దిశ, ఘట్కేసర్ : ఇరిగేషన్ శాఖ అధికారుల అవినీతికి అంతులేకుండా పోయింది. వెంచర్లు, అపార్ట్మెంట్ నిర్మాణాల కోసం కాంట్రాక్టర్లు హెచ్ఎండిఏ అనుమతుల కోసం ఇరిగేషన్ శాఖ ఇచ్చే నిరభ్యంతర దృవీకరణ పత్రం (ఎన్ఓసి) కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా రూ.లక్షలు లంచాలు తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా ఎన్ఓసీలు జారీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో నాలాలు, చెరువులు, కుంటలపై నిర్మించిన అక్రమ నిర్మాణాల భాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థ దూకుడుకి కాంట్రాక్టర్లు, అధికారులు హడలిపోతున్నారు.

నాలాల దారి మళ్లింపు...

ఘట్కేసర్ మున్సిపాలిటీలో సర్వే నెంబర్ 96, 97 లో దాదాపు 30 ఎకరాల్లో శిరీన్ పార్క్ కన్స్ట్రక్షన్ సంస్థ 12 అంతస్తుల భవనాలను నిర్మిస్తోంది. 2021 సంవత్సరంలో హెచ్ఎండిఏ అనుమతి కోసం ఇరిగేషన్ శాఖ నుంచి ఎన్ఓసీలు తెచ్చుకుంది. ఇరిగేషన్ శాఖ చూపించిన నాళాలను దారి మళ్లించి అక్రమ నిర్మాణాలు చేపడుతోంది. అయితే గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ భాగం నుంచి వస్తున్న వర్షం నీరంతా నాలాల నుంచి కాకుండా రోడ్లపై పారుతోంది. ఈ విషయంపై స్థానిక వార్డు కౌన్సిలర్ బేతాళ నర్సింగ్ రావు పలుసార్లు ఫిర్యాదు చేసినా ఇరిగేషన్ శాఖ అధికారులు పట్టించుకోలేదని విమర్శలున్నాయి. ప్రతి ఏటా వర్షాకాలంలో ఈ నాలాల నుంచి వచ్చే నీరంతా ఘట్కేసర్ పట్టణంలోని చిన్న చెరువులోకి చేరుతుంది. అయితే నాలాల దారి మళ్లింపు వల్ల ఈ వర్షాకాలంలో వర్షం నీరు చెరువులోకి చేరకపోవడంతో చెరువు నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయిందని స్థానికులు వాపోతున్నారు.

హైడ్రాకు ఫిర్యాదు చేస్తాం : నర్సింగరావు, వార్డు కౌన్సిలర్

నాలా కబ్జా విషయంపై హైడ్రాకు ఫిర్యాదు చేస్తామని కౌన్సిలర్ నర్సింగ్ రావు తెలిపారు. గతంలో నాలాలపై అక్రమ నిర్మాణాల గురించి గురించి ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. హెచ్ఎండీ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా లేఔట్లకు పర్మిషన్ ఇస్తున్నారని ఆరోపించారు. ఇరిగేషన్ శాఖ హెచ్ఎండిఏ అధికారులు ఇస్తున్న అనుమతులపైన హైడ్రా అధికారులు పరిశీలించాలని కోరారు.

నాలాలపై నిర్మాణాలను కూల్చివేస్తాం : పరమేశ్వర్, ఇరిగేషన్ శాఖ ఏఈ

నాలాలపై అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని ఇరిగేషన్ శాఖ ఏవి పరమేశ్వర్ తెలిపారు. ఇరిగేషన్ శాఖ నుంచి ఎన్ఓసీలు తీసుకొని నిర్మాణ సంస్థలు అక్రమ నిర్మాణాలు పాల్పడుతున్న విషయం తమ ఇప్పుడే తెలిసిందని, ఉన్నతాధికారులకు సమాచారం అందించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.


Similar News