మూసీ, ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్ల జోలికి వస్తే ప్రతిఘటిస్తాం.. సీపీఐ(ఎం)

మూసీ నది ప్రక్షాళన పేరుతో పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్ల జోలికొస్తే పేద ప్రజల పోరాటాల తరఫున, సీపీఐ(ఎం) పార్టీ ప్రతిఘటిస్తుందని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు.

Update: 2024-10-04 13:47 GMT

దిశ, ఉప్పల్ : మూసీ నది ప్రక్షాళన పేరుతో పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్ల జోలికొస్తే పేద ప్రజల పోరాటాల తరఫున, సీపీఐ(ఎం) పార్టీ ప్రతిఘటిస్తుందని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. రామంతపూర్ లోని కేసీఆర్ నగర్, బాలకృష్ణ నగర్ మూసీ పరివాహక కాలనీలలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పర్యటించారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు, తమ గోడును ఎర్రజెండా నాయకులకు చెప్పుకున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఉద్దేశించి సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు ఎస్.వీరయ్య మాట్లాడుతూ మూసి సుందరీకరణ పేరుతో 1.50 కోట్ల సంపన్నుల వ్యాపారుల లబ్ధి కోసం రాజకీయ, కాంట్రాక్టర్ల మేలుకోసం పేద ప్రజల పొట్టకొట్టి, వారి ఇళ్లను కూల్చి వేస్తామని అనడం దుర్మార్గమైనచర్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే, పేద ప్రజల పక్షాన సీపీఐ(ఎం) ప్రతిఘటిస్తుందని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ గ్రామాల్లో వ్యవసాయ భూములు అమ్ముకొని, జీవనోపాధి కోసం వచ్చి ఇళ్లను నిర్మించుకొని బ్రతుకుపోరాటం చేస్తుంటే పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చివేస్తామనడం ప్రభుత్వనికి సిగ్గుచేటు అన్నారు. మూసీని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం కోసం పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు నాశనం చేయడం ప్రభుత్వానికి తగదు అన్నారు. ప్రజా పోరాటాలకు, ప్రజల కోసం పోరాటం చేయడానికి సిపిఐఎం అండగా ఉంటుందన్నారు. సీపీఐ(ఎం) మేడ్చల్ జిల్లా కార్యదర్శి సత్యం మాట్లాడుతూ పేద ప్రజల ఇల్లను కాపాడుకోవడం కోసం ప్రజల తరఫున ఉద్యమించడానికి సీపీఐ(ఎం) అండగా నిలుస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, సీపీఐ(ఎం) మేడ్చల్ మల్కాజ్గిరి కార్యదర్శివర్గ సభ్యురాలు ఎం.వినోద, చంద్రశేఖర్, అశోక్, ఉప్పల్ సీపీఐ(ఎం) కార్యదర్శి జే వెంకన్న, మేడిపల్లి కార్యదర్శి సృజన, ఘట్కేసర్ కార్యదర్శి సబిత, కాప్రా కార్యదర్శి శ్రీనివాస్, ఉప్పల్ సీపీఐ(ఎం) నాయకులు పాల్గొన్నారు.


Similar News