కార్యకర్తల కష్టాన్ని మరిచిపోను
అసెంబ్లీ ఎన్నికల్లో ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ నుంచి భారీ మెజారిటీ అందించేందుకు పని చేసిన కార్యకర్తలు, నాయకులను మరిచిపోనని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
దిశ, కూకట్పల్లి : అసెంబ్లీ ఎన్నికల్లో ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ నుంచి భారీ మెజారిటీ అందించేందుకు పని చేసిన కార్యకర్తలు, నాయకులను మరిచిపోనని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ నుంచి అత్యధిక మెజారిటీ అందించి గెలిపించారని అన్నారు. తన గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలు, నాయకులను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని, వారి కష్ట సుఖాలలో అండగా ఉంటానని అన్నారు. డివిజన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగిందని, గతంలో మాజీ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో వేలాది కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డివిజన్లో బోయిన్ చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనులను ప్రారంభించినట్టు చెప్పారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు కోట్లాది రూపాయల నిధులు కేటాయించినట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ధి కుంటు పడిందని, ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజలకు, బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలను గాలికి వదిలేసి గారడి చేయడం తప్ప అభివృద్ధిపై దృష్టి సారించలేదని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్నా అభివృద్ధి మాత్రం శూన్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఇర్ఫాన్, నరేందర్ గౌడ్, మక్కల నరసింగరావు, బాలరాజ్, ఎజాజ్, జంగయ్య, ఉదయ్ యాదవ్, అవినాష్, లలిత, అనురాధ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.