యాప్రాల్ నాగిరెడ్డి చెరువుపై ‘హైడ్రా’ నజర్.. అక్రమ నిర్మాణాలు కూలుతాయా..?

Update: 2024-08-25 13:00 GMT

దిశ, మల్కాజిగిరి : మల్కాజిగిరి సర్కిల్ యాప్రాల్ నాగిరెడ్డి చెరువు ఆక్రమణలను హైడ్రా నజర్ పెడుతోంది. ఇక్కడ చెరువు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో వెలిసిన బహుళ అంతస్తుల నిర్మాణాలపై అధికారుల బృందం ఆరా తీస్తోంది. దీంతో అక్రమార్కులు గుండెల్లో దడ పుట్టిస్తోంది. తాజాగా తమ్మిడికుండలోని ఎన్ కన్వేన్షన్ లో వెలిసిన అక్రమ నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేయడంతో.. చెరువు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో వెలిసిన అక్రమ నిర్మాణదారుల్లో వణుకు మొదలైంది. గతంలో యాప్రాల్ నాగిరెడ్డి చెరువు నిండుకుండలా కళకళలాడేది. కబ్జాదారులు చేతిలో చిక్కి నేడు ఈ చెరువు చిన్న కుంటను తలపిస్తోంది. రాజకీయ నాయకుల ప్రమేయంతోనే చెరువు కబ్జాల బారిన పడిందనే విమర్శలున్నాయి. నాగిరెడ్డి గొలుసుకట్ట చెరువు సర్వే నెంబర్ 47, 48, 49, 50లలో చెరువు 19.5 ఎకరాల విస్త్రీర్ణంలో ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు స్పష్ణం చేస్తున్నాయి. నాడు నిండుకుండలా ఉన్న చెరువు.. నేడు మురికికుంటగా మారి విలవిలలాడుతోంది.

చెరువు బఫర్ జోన్, ఎఫ్ టీఎల్ స్థలాలను కొల్లగొట్టి బహుళ అంతస్తుల నిర్మాణాలు, కమర్షియల్ షెడ్లు వెలిశాయి. అయితే ఇక్కడి చెరువును పరిరక్షించాలంటూ గ్రామస్ధులు జేఏసీగా ఏర్పడి చెరువు పరిరక్షణకు పోరాడుతున్నా ఫలితం కనిపించడం లేదని అక్రమార్కులు యథేచ్చగా నిర్మాణాలు కొనసాగిస్తున్నారంటూ పలువురు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మన ఊరు, మన చెరువులో భాగంగా ఇక్కడి చెరువును బాగు చేయాలని స్థానికులు అధికారులకు వినతి పత్రాలు అందజేసినా కబ్జాల పర్వం మాత్రం ఆగట్లేదని.. పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా చెరువుల సంరక్షణకు చర్యలు చేపడుతారో లేదోననే అనుమానాలు తొలుగనున్నాయి. యాప్రాల్ నాగిరెడ్డి చెరువును హైడ్రా కమిషనర్ రంగనాధ్ పరిశీలించడంతో ఇక్కడి చెరువు లో వెలిసిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తప్పవని తెలుస్తోంది.


Similar News