గెలిచేందుకు మోయలేని హామీలిచ్చారు : ఈటల

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత హామీల పేరుతో

Update: 2024-04-12 11:41 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత హామీల పేరుతో మోసం చేస్తుందని మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. రేవంత్ రెడ్డి తన ఆరు గ్యారెంటీలను నెరవేర్చలేక ఇప్పుడు ఎంపీ సీట్లు కూడా గెలిస్తే హామీలను నెరవేరుస్తానని చెబుతూ మరో మారు ఓటర్లను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన కొంపల్లి లో బొబ్బిలి వెల్ఫేర్ అసోసియేషన్, మౌలాలి లో జరిగిన మరో సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేస్తే అది వ్యర్థమే అని, రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి ఈ ప్రాంత సమస్యలు తాను తీర్చగలుగుతానని తెలిపారు.

మోయలేని హామీలు ఇచ్చారు..

రేవంత్ రెడ్డి గోల్మాల్ మాటలకు ప్రజలు వంగిపోయారని, ముందు చూపు లేకుండా ఏమాత్రం అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కారని దుయ్యబట్టారు. పోయలేకుండా హామీలు ఇస్తున్నప్పుడు చర్చ పెట్టే బాధ్యత మేధావులు పై ఉంటుందని అవి అమలు అవుతాయా..? కావా? అనే మీమాంస జరగకపోవడం వల్ల ప్రజలు మోసపోయారని తెలిపారు. కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం ఇస్తానన్న రేవంత్ ఆ మాట మర్చిపోవడమే కాకుండా పెళ్లికి ఇస్తానన్న లక్ష రూపాయలు పిల్లలు పుట్టాక ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక ఆర్థిక మంత్రిగా పనిచేసిన తనకు ఈ హామీలు చూసి పిచ్చోన్ని అయిపోయా అని అన్నారు. కోటిన్నర మంది మహిళలకు నెలకు రెండు వేల 500 రూపాయలు చొప్పున ఇస్తే సంవత్సరానికి 40 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

ప్రజల ఆరోగ్యాన్ని పణంగా..

తెలంగాణ రాష్ట్రం రాకముందు మద్యం ద్వారా వచ్చే ఆదాయం 10 వేల ఏడు వందల కోట్ల రూపాయలని ఈనాడు అది 45 వేల కోట్ల రూపాయలకు చేరిందన్నారు. ఈ ఆదాయం కోసం ఎంతో మంది మహిళల పుస్తెలతాడు తెగిపడతాయని, మద్యం ద్వారా వచ్చే ఆదాయంతోనే జీతాలు పెన్షన్లు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి రాష్ట్రంలో అమలు చేయలేని ఇన్ని హామీలు ఏ విధంగా ఇచ్చారని..? ఇవి అమలు చేయడానికి మద్యం ద్వారా ఆదాయం పెంచుకునేందుకు ప్రతి 100 మందికి ఒక బెల్ట్ షాపును అందుబాటులోకి తెచ్చి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని విమర్శించారు.

మల్కాజిగిరి అభివృద్ధి పై మోదీ హామీ..

ఇటీవల మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో జరిగిన ప్రధానమంత్రి మోడీ రోడ్ షో అనంతరం “ఆప్ జరూర్ జీతేగా .. జీత్ కే ఆవో.. మల్కాజ్గిరికో డెవలప్ కరింగే” అని మోడీ స్పష్టమైన హామీ ఇచ్చారని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ఎన్నుకునేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాలలో దేశంలో ఎక్కడ బాంబుల మూతలు లేవని టెర్రరిస్టులను ఎక్కడికక్కడ నిలువరించారని అదేవిధంగా కోవిడ్ వంటి మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతుంటే మన దేశం ధైర్యంగా నిలబడేటట్లు నరేంద్ర మోడీ ప్రపంచ దేశాల ముందు ఉంచారని అన్నారు. ప్రపంచ దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ను సరఫరా చేయడమే కాకుండా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ ను అందజేసిన ఘనత మోడీదేనని తెలిపారు. విదేశీ పాలకులు కూల్చివేసిన అయోధ్య రామాలయాన్ని తిరిగి నిలబెట్టిన ఘనత మోడీ దేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి అభివృద్ధి పనులు కోసం నిధులు తేవడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం సహాయం తో మల్కాజిగిరి నీ అభివృద్ధి చేస్తానని అందుకు ఓటు వేసి తనని గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన ఓటర్లను అభ్యర్థించారు.


Similar News