ఎన్నికల్లో వాగ్ధానాలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్న ప్రభుత్వం: మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్

ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యం కాని వాగ్ధానాలు ఇచ్చి.. ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకోవడం సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికే చెల్లిందని మల్కాజ్‌గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు.

Update: 2024-04-04 15:37 GMT

దిశ, కంటోన్మెంట్/బోయిన్‌పల్లి: ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యం కాని వాగ్ధానాలు ఇచ్చి.. ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకోవడం సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికే చెల్లిందని మల్కాజ్‌గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆరు, ఏడు వార్డులలో నిర్వహించిన ఎన్నిక ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, బీజేపీ నేత సదాకేశవరెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి మల్కాజ్‌గిరి తన స్థానమే అని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు.

మల్కాజ్‌గిరి రేవంత్‌రెడ్డి జాగీరు కాదని.. ఇది ప్రజల జాగీరు అని ధ్వజమెత్తారు. ఐదేళ్లు ఎంపీగా ఉండి నియోజవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని స్పష్టం చేశారు. కనీసం కార్పొరేటర్, ఒక కౌన్సిలర్, ఓ ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేక పోయాడని ఎద్దేవా చేశారు. ఏ కాలనీ బస్తీ వారైనా.. ఈసారి మళ్లీ నరేంద్ర మోడీకే ఓటు వేసి మూడో‌సారి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 12 శాతం ఉన్న మాదిగలకు ఒక్క పార్లమెంటు సీటు కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని ఆరోపించారు. మాదిగలకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని అన్నారు.

ఒక పార్టీ గుర్తుపై గెలిచి, ఆ పార్టీకి రాజీనామా చేయకుండా, వేరే పార్టీలో చేరితే రాళ్లతో కొట్టి చంపాలన్న రేవంత్ రెడ్డి ఇతరులను కాంగ్రెస్ పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. ఈటెల రాజేందర్ అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల మనిషినని, మల్కాజ్‌గిరిలో బీజేపీ జెండా ఎగురవేసి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వరంగల్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్, బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ టీఎన్ వంశ తిలక్, మాజీ కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు భానుక నర్మద మల్లికార్జున్, సుస్మిత శంకర్ రావు, పిట్ల నాగేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


Similar News