ప్రభుత్వ భూములను కలిపేసుకున్నారు

చెరువు భూములతో పాటు ప్రభుత్వ భూములు ఉన్నచోట వెంచర్ వేయడం…అపార్ట్మెంట్స్.. విల్లాలు కట్టడం…వాటిని ఫ్రీ లాంచ్ ఆఫర్స్ పేరిట అంటగట్టడం పరిపాటిగా మారింది.

Update: 2024-10-24 10:37 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : చెరువు భూములతో పాటు ప్రభుత్వ భూములు ఉన్నచోట వెంచర్ వేయడం…అపార్ట్మెంట్స్.. విల్లాలు కట్టడం…వాటిని ఫ్రీ లాంచ్ ఆఫర్స్ పేరిట అంటగట్టడం పరిపాటిగా మారింది. ఓ పక్క హైడ్రా చెరువులు, ప్రభుత్వ భూములు సంరక్షణగా ముందుకు వెళ్తుంటే మరోపక్క పలు ప్రైవేట్ వెంచర్స్ డెవలప్ చేసేవాళ్లు యథావిధిగా తమ అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తూనే ఉన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో పలు ప్రాజెక్టులు చేపట్టిన ‘త్రిపుర ల్యాండ్ మార్క్’ నిర్మాణాలు ఇదే కోవలోకి వస్తున్నాయి.

కలిపేసుకుంటున్నారు…

దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో పలు ప్రాంతాలలో త్రిపుర ల్యాండ్ మార్క్ వారు ఐదు ప్రాజెక్టులను చేపట్టారు. వీటిలో మూడు ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తికాగా మరో రెండు ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. త్రిపుర ల్యాండ్ మార్క్ 4, త్రిపుర ల్యాండ్ మార్క్ 5 ప్రాజెక్టులు ఒకటి బొరంపేట రెవెన్యూ పరిధిలో జరుగుతుండగా మరొకటి డిపోచంపల్లి రెవెన్యూ పరిధిలో జరుగుతుంది.

     కాగా ఇప్పటికే పూర్తయిన త్రిపుర ల్యాండ్ మార్క్ 3 పక్కనే చేపట్టిన త్రిపుర ల్యాండ్ మార్క్ 4 నిర్మాణాలలో కొద్ది భాగం ప్రభుత్వ భూమితో పాటుగా, పక్కనే ఉన్న కోమటికుంట చెరువు ఎఫ్ టీఎల్ బఫర్ జోన్ లో కూడా ఆక్రమించి చేపట్టినవే. అదే విధంగా డిపోచంపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న పడగసముద్రం చెరువు కట్టతో పాటుగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ను ఆక్రమించి త్రిపుర ల్యాండ్ మార్క్ 5 నిర్మాణాలు జరుగుతున్నాయి. అంతేకాదు ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూమిని కూడా కొంతమేర కలిపేసుకుని నిర్మాణాలు చేస్తున్నారు.

అనుమతులు ఎలా పొందుతున్నారు..?

2018లో బరంపేట గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న కోమటికుంట చెరువు పక్కనే ఉన్న సర్వే నెంబర్​ 241 లో త్రిపుర ల్యాండ్మార్క్ త్రీ అనుమతులు ఉంది పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 225 లో ఎమినిటీస్ భవనాలను నిర్మించింది. ప్రస్తుతం చేపట్టిన త్రిపుర ల్యాండ్ మార్క్ 4 ప్రాజెక్ట్ లో కూడా ఇదే ప్రభుత్వ భూమి కొంతమేర కలుస్తుంది. అంతేకాకుండా కోమటికుంట చెరువు బఫర్ జోన్ ఎఫ్డీఎల్ ప్రాంతం సైతం ఈ నిర్మాణాల ప్రాంతంలో ఉంది.

    అదే విధంగా డిపోచంపల్లి లో ఉన్న పడగసముద్రం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతం ల్యాండ్ మార్క్ 5 లో కలిసి ఉండటంతో పాటుగా సర్వేనెంబర్ 181 ప్రభుత్వ భూమిని కొంతమేర ఈ ప్రాజెక్టులో కలిపేసుకుని పనులు చేపట్టేశారు. అయితే చెరువు భూములతో పాటుగా ప్రభుత్వ భూములలో నిర్మాణాలు చేసుకునేందుకు హెచ్ఎండీఏ ఏ విధంగా అనుమతులు ఇచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ పట్టా భూముల సర్వే నెంబర్లను పేర్కొంటూ అనుమతులు పొంది పక్కనే ఉన్న ప్రభుత్వ భూములలో సైతం కొంత భాగాన్ని కలిపేసుకుని నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


Similar News