ప్రభుత్వ భూమి ప్రైవేటుపరం

వడ్డించే వాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చుంటే ఏముంది అనే చందంగా మారింది జిల్లా అధికారుల వ్యవహారం.

Update: 2024-11-09 10:35 GMT

దిశ, ఘట్కేసర్ : వడ్డించే వాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చుంటే ఏముంది అనే చందంగా మారింది జిల్లా అధికారుల వ్యవహారం. వీరు తలుచుకుంటే ప్రభుత్వ భూమి ప్రైవేటు పరం చేమడం పెద్ద పనేమి కాదని తేలింది. ఘట్కేసర్ మండల రెవెన్యూ పరిధి కొర్రెముల గ్రామం వెంకటాపూర్లో 12 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల పేరున రెవెన్యూ రికార్డుల్లో నమోదైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక ఎకరం దాదాపు రూ. 3 నుంచి రూ.4 కోట్లు పలికే దాదాపు రూ.40 కోట్ల విలువ చేసే 12 ఎకరాల ఈ భూమిని ధరణి రికార్డుల్లోకి ఎక్కించ్చేందుకు అధికారులు ఫిఫ్టీ ఫిఫ్టీ షేరింగ్ కింద బేరాలు కుదుర్చుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

    రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ప్రభుత్వ భూమి బదలాయింపు కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్గా పనిచేసిన అమోయ్ కుమార్ వెంకటాపూర్ లోని 12 ఎకరాల ప్రభుత్వ భూమి బదలాయింపుల వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్లు ప్రచారం జరుగుతోంది. వెంకటాపూర్ లోని 12 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల పేరున రికార్డుల్లోకి నమోదైన తీరుపై పరిశీలన చేయగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

నకిలీ దస్త్రాలు...

1999-2000 సంవత్సరంలో వెంకటాపూర్ కు చెందిన నీరుడి పెద్ద సత్తయ్య (65)కు మూడు ఎకరాలు, నీరుడి జంగయ్య (30)కు మూడు ఎకరాలు, నీరుడి సత్తయ్య(60)కు రెండు ఎకరాలు, నీరుడి కిష్టయ్య(56)కు రెండు ఎకరాలు, నీరుడి జంగమ్మకు (54) రెండు ఎకరాలు అసైన్డ్ చేస్తూ అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ శాఖ ఘట్కేసర్ మండల రెవెన్యూ అధికారులకు ప్రొసీడింగ్స్ ఆర్డర్ B/125/99 తయారుచేసి వీటి ఆధారంగానే నకిలీ పట్టా పాసు బుక్కులు సైతం తయారు చేసినట్లు సమాచారం.

    ఈ నకిలీ ఆర్డర్, పట్టాదారు పాస్ పుస్తకాలను అప్పటి పట్వారి కిషన్ రావు దాదాపు రూ.3 లక్షలు తీసుకొని తయారుచేసి ఇచ్చినట్లు తెలిసింది. ఇవన్నీ తయారు చేసి ఇచ్చిన పట్వారి పహాణి రికార్డులలో ఎక్కడా నమోదు చేయకుండా జాగ్రత్త పడగా 2023 సంవత్సరం వరకు కూడా రెవెన్యూ రికార్డుల పహాణీలలో వీరి పేర్లు ఎక్కడా నమోదు కాలేదు. అయితే ఎలాగైనా ఈ భూమిని సొంతం చేసుకోవాలని, రికార్డుల్లో పేర్లెక్కిచ్చేందుకు పెద్ద ఎత్తున లాబీయింగ్ కు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది.

జిల్లా అధికారులతో కుమ్మక్కై...

వెంకటాపూర్లో సర్వే నెంబర్ 174 లో 18.12 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా 2017లో డబుల్ బెడ్ రూమ్ల నిర్మాణం కోసం 6 ఎకరాలను కేటాయించారు. డబుల్ బెడ్ రూమ్ భూముల కేటాయింపు విషయంలో స్థానికంగా కొందరు వివాదాలు చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ భూమి తమ ఆధీనంలో ఉన్నట్లుగా చుట్టూ కంచె వేసి ఆకు కూరలు సేద్యం చేస్తున్నట్లుగా చూపించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అప్రమత్తమై ఈ భూమి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి వెళితే తమ శ్రమ వృథా అయిపోతుందని గమనించిన వ్యక్తులు జిల్లా స్థాయి అధికారులతో కుమ్మకైనట్లు తెలిసింది.

మీకు కొంత మాకు కొంత....

2023 సంవత్సరంలో జేసీ స్థాయి అధికారి ద్వారా ఫిఫ్టీఫిఫ్టీ షేరింగ్ ఒప్పందాలు కుదుర్చుకొని గత సంవత్సరం జిల్లా కలెక్టర్ అమోయి కుమార్ తో పట్టాదారు పాస్ పుస్తకాలకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ధరణి రికార్డుల్లోకి నీరుడి జంగయ్య కు మూడు ఎకరాలు, నీరుడి క్రిష్టయ్యకు రెండు ఎకరాలు, నీరుడి సత్తయ్యకు రెండు ఎకరాలు, నీరుడి జంగమ్మకు రెండు ఎకరాలు, నీరుడి రామారావు(మాజీ ఎంపీటీసీ)కు మూడు ఎకరాల చొప్పున ధరణి రికార్డులలో పేర్లు నమోదు అయ్యాయి.

    వీరి పేరున పట్టదారు పాసుపుస్తకాలు కూడా జారీ అవడం గమనార్హం. అయితే 1999-2000 సంవత్సరంలో 12 ఎకరాల భూమిని అసైన్డ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉన్న వ్యక్తుల పేరున కేటాయించిన విస్తీర్ణానికి, ప్రస్తుతం ధరణి రికార్డులో వారసత్వంగా వచ్చిన వ్యక్తుల పేరున నమోదైన భూముల విస్తీర్ణానికి ఎలాంటి పొంతన లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై మాజీ ఎంపీటీసీ నీరుడి రామారావును సంప్రదించగా తాము ఎలాంటి నకిలీ పాస్ పుస్తకాలు, దస్త్రాలు సృష్టించలేదని, మా భూమి కోసం మేము 8 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఈ భూమి వ్యవహారం కోర్టు వివాదంలో ఉందని చెప్పారు.

హైడ్రా దృష్టి సాధించాలి....

వెంకటాపూర్ లోని 12 ఎకరాల ప్రభుత్వ భూమి రికార్డుల బదలాయింపు విషయంలో హైడ్రా అధికారులు దృష్టి సారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల పరం కాకుండా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు. అడ్డదారిలో ప్రభుత్వ భూములు కబ్జా చేసేందుకు యత్నించిన వ్యక్తులు, అందుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

పూర్తిగా ప్రభుత్వ భూమే : డిప్యూటీ తహసీల్దార్ రాజేందర్



కొర్రెముల రెవెన్యూ పరిధి వెంకటాపూర్ సర్వే నెంబర్174 లోని 12 ఎకరాల భూమి పూర్తిగా ప్రభుత్వ భూమేనని డిప్యూటీ తహసీల్దార్ రాజేందర్ చెప్పారు. అయితే 12 ఎకరాల భూమికి తామే అసైన్డ్ దారులమంటూ భూమి తమకు చెందేలా న్యాయం కోసం కోర్టుకు వెళ్లారని, ఏదేమైనా రెవెన్యూ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలతో 2023 లో అప్పటి ఘట్కేసర్ మండల తహసీల్దార్ కృష్ణను అసైన్డ్ ధారులు సంప్రదించగా ఆయన రిజెక్ట్ చేశారని తెలిపారు. దాంతో జిల్లా స్థాయి అధికారులను సంప్రదించి 2023 అక్టోబర్ 12న రికార్డుల్లోకి ఎక్కి ఉండవచ్చునని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వ భూములపై పూర్తిస్థాయి విచారణ జరిపి ధరణి రికార్డుల్లో ప్రైవేట్ వ్యక్తుల పేర్లను తొలగించాలని జిల్లా అధికారులు సూచించారని రాజేందర్ తెలిపారు. 


Similar News