ప్రభుత్వ భూములను రక్షించండి.. సురేందర్ రెడ్డి

ప్రభుత్వ భూములను పరిరక్షించాలని తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.సురేందర్ రెడ్డి కోరారు.

Update: 2024-09-30 14:56 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : ప్రభుత్వ భూములను పరిరక్షించాలని తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.సురేందర్ రెడ్డి కోరారు. మేడ్చల్ జిల్లా, అల్వాల్ లోని సర్వే నెంబర్లు 582, 583, 584లలో ఉన్న ప్రభుత్వ (యూఎల్ సీ) భూములు కబ్జాకు గురవుతున్నాయని, వాటిని రక్షించాలని సోమవారం మేడ్చల్ కలెక్టర్ గౌతమ్ కు సురేందర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ జొన్న బండ ప్రాంతంలో రూ.400 కోట్ల విలువైన 34.4 ఎకరాల ప్రభుత్వ భూములను కొందరు అక్రమించి రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. దీని పై 2020 సంవత్సరంలో న్యాయవాది విజయ్ కుమార్ హై కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ లక్ష్మి నారాయణలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి 2023, నవంబర్ 3వ తేదీన అప్పటి మేడ్చల్ కలెక్టర్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

సదరు సర్వే నెంబర్ లలో గల భూమిపై తగిన విచారణ జరిపి భూమి ప్రైవేట్ దా లేక ప్రభుత్వనిదా తేల్చాలని కోరింది. ఒకవేళ సదరు భూమి ప్రభుత్వానిది అని తెలితే అందులోని భూ ఆక్రమణదారులను తొలగించి స్వాధీనం చేసుకోవాలని హై కోర్టు ఆదేశించినట్లు పేర్కొన్నారు. అయితే కొందరు రెవెన్యూ, జీహెచ్ఎంసీ, రిజిస్ట్రేషన్ అధికారులు మామూళ్లకు అశపడి ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని సురేందర్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తుంటే రెవెన్యూ యంత్రాంగం కట్టడి చేయడంలేదని, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు అపార్ట్ మెంట్లు, బహుళ అంతస్థులకు ఫర్మిషన్లు ఇస్తున్నారని మండిపడ్డారు. రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వ భూములలో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తుందని, ఈ శాఖల పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కబ్జాదారుల పై పీడీ యాక్టు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరినట్లు సురేందర్ రెడ్డి తెలిపారు.


Similar News