ఫేక్ డాక్యుమెంట్స్ ముఠా అరెస్ట్..

ఖాళీ స్థలం పై కన్నేసిన ఓ పార్టీ నాయకురాలు ఫేక్ డాక్యుమెంట్స్ ముఠాతో చేతులు కలిపి నకిలీ పత్రాలను సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకోంది.

Update: 2024-10-04 16:42 GMT

దిశ, పేట్ బషీరాబాద్ : ఖాళీ స్థలం పై కన్నేసిన ఓ పార్టీ నాయకురాలు ఫేక్ డాక్యుమెంట్స్ ముఠాతో చేతులు కలిపి నకిలీ పత్రాలను సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకోంది. అసలైన ప్లాట్ ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరగడంతో విచారణలో నకిలీ డాక్యుమెంట్స్ వ్యవహారం బయటపడింది. ఈ మేరకు బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఓల్డ్ సిటీకి చెందిన సురేష్ అనే వ్యక్తికి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి సుభాష్ నగర్ ప్లాట్ నెంబర్ 147 లో 2 వందల గజాల ఖాళీ స్థలం ఉన్నది. సంవత్సరాలుగా ఈ స్థలం ఖాళీగా ఉండటంతో కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ మహిళా నాయకురాలు పద్మజా రెడ్డి అలియాస్ కుత్బుల్లాపూర్ పద్మక్క ఈ భూమిని సొంతం చేసుకోవాలని వ్యూహం పన్నింది. అందుకుగాను హయత్ నగర్ కు చెందిన రేపాక కరుణాకర్ ను సంప్రదించింది.

నకిలీ పత్రాలను సృష్టించేందుకు వీరిద్దరి మధ్య మూడున్నర లక్షల రూపాయలకు ఒప్పందం కుదిరింది. అనుకున్న విధంగానే నకిలీ పత్రాలను సృష్టించి వాటి ద్వారా కుత్బుల్లాపూర్ ఎస్ఆర్ఓ కార్యాలయంలో 2023 ఫిబ్రవరి నెలలో పద్మజా రెడ్డి అలియాస్ కుత్బుల్లాపూర్ పద్మక్క సోదరి నాగిరెడ్డి హోమల కుమారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఈ విషయం తెలిసిన బాధితుడు జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించగా విచారణలో నకిలీ పత్రాల ముఠా విషయం బయటపడింది. దీంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి పలు రకాల ఫేక్ డాక్యుమెంట్స్ తో పాటుగా ఆధార్ కార్డ్ మోడిఫికేషన్ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే మీడియా సమావేశంలో నిందితురాలైన పద్మజా రెడ్డి తాను ల్యాండ్ కబ్జా అవుతుందని ఫిర్యాదు చేశానని, కానీ పోలీసులు తనపైనే కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నించారు.

నకిలీ పత్రాలను ఎలా సృష్టిస్తారు అంటే..?

నకిలీ పత్రాల సృష్టికర్తలు ప్రధాన నిందితుడు రేపాక కరుణాకర్ ముందుగా సంబంధిత ప్లాట్ లేదా భూమి సీసీ కాపీలను ఆయా సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి పొందుతాడు. ఆ కాపీల ద్వారా అసలైన పత్రాలకు ఏమాత్రం తేడా లేకుండా నకిలీ పత్రాలను సృష్టిస్తాడు. అంతే కాకుండా పెద్ద అంబర్పేట్ కు చెందిన ఆధార్ సెంటర్ ఆపరేటర్ గగనం నరేంద్ర సహకారంతో అసలైన ప్లాటు యజమానులకు సంబంధించిన ఫేక్ ఆధార్, పాన్ కార్డ్, ఇతరాత్ర ధ్రువీకరణ పత్రాలు, డెత్ సర్టిఫికెట్స్ లను సృష్టిస్తాడు. అనంతరం గుంటూరు కొరిటపాడుకు చెందిన వట్టరం రవిశంకర్, మేకల హరీష్ లను యజమానులుగా చూపిస్తూ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేపిస్తాడు. ఇందుకు ఆయా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కరుణాకర్ కు సహకరించేవారు ఉన్నారు.

కాగా ప్రధాన నిందితుడైన కరుణాకర్ గతంలో హయత్ నగర్ లో రాబరీలు చేసేవాడని అనంతరం ఈ ఫేక్ డాక్యుమెంట్స్ దందాలోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ పత్రాలు సృష్టించే ఈ ముఠాపై హయత్ నగర్, మీర్పేట్, మేడిపల్లి, సుల్తాన్ బజార్, మైలార్ దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 6 కేసులు ఉన్నాయని డీసీపీ పేర్కొన్నారు. ఈ ముఠాను పట్టుకోవడం ద్వారా జూబ్లీహిల్స్, హయత్ నగర్, వైజాగ్ వంటి ప్రాంతాల్లో నకిలీ డాక్యుమెంట్స్ తో రిజిస్ట్రేషన్ చేయించుకుంటానికి సిద్ధంగా ఉంచిన పత్రాలను సైతం స్వాధీనం చేసుకున్నామని, దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందని అన్నారు. ఈ ముఠాకు సహకరించిన సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ ఉద్యోగుల పై పూర్తివిచారణ చేసి వారి పై కూడా చర్యలు తీసుకుంటామని డీసీపీ స్పష్టం చేశారు. అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఎసీపీ హనుమంత రావు, జీడిమెట్ల సీఐ మల్లేష్ పాల్గొన్నారు.


Similar News