ప్రణాళికా బద్దంగా పనులు చేపట్టాలి...ఈటెల

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో మంగళవారం కౌన్సిల్ హాల్ లో సాధారణ సమావేశం జరిగింది.

Update: 2024-09-03 16:34 GMT

దిశ, దుండిగల్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో మంగళవారం కౌన్సిల్ హాల్ లో సాధారణ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొన్నాడు. 14.56 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశ పెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో జరగనున్న అభివృద్ధి పనులను జనాభా పెరుగుదల ప్రకారముగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 30 నుంచి 40 సంవత్సరాలకు సరిపోయే విధంగా రోడ్ల నిర్మాణము, కల్వర్ట్ నిర్మాణము, అండర్ గ్రౌండ్ డ్రైన్ నిర్మాణం పనులు చేపట్టాలన్నారు. డ్రైనేజీ, కట్టుకాలువలు నిర్మిస్తునప్పుడు ప్రణాళిక బద్దంగా పనులు చేపట్టాలన్నారు. కౌన్సిల్ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు గతంలో ప్రవేశపెట్టిన పనుల పై సమీక్ష జరిపి వాటిని పూర్తి చేసిన తర్వాత కొత్త పనులకు ఆమోదం తెలపాలన్నారు. నిధులు లేకున్నా హడావిడిగా బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రజలను అయోమయానికి గురిచేయవద్దని చైర్మన్ కు, పాలక వర్గానికి సూచించారు, సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నుండి కొంపల్లి మున్సిపాలిటికి స్టాంప్ డ్యూటీ ఆదాయం ఎన్ని సంవత్సరాల నుండి రావడం లేదని అడిగారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలతో రావాల్సిన నిధుల సిద్ధం చేయాలన్నారు.

పాలవర్గం పై పలు ఆరోపణలు..

నిధుల కేటాయింపుల్లో మున్సిపల్ పాలకవర్గం పై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1వ వార్డు అపర్ణా ఫామ్ గ్రోవ్స్ వద్ద ఆర్సీసీ పైప్ లైన్ బిట్-1 వేయడానికి 40 లక్షలు, అదే వార్డులో ఆర్సీసీ బిట్ - 2 వేయుటకు 40 లక్షలు, అదే వార్డులో ఆర్ సి సి బిట్-4 వేయుటకు 40 లక్షలు ఏంజిఎఫ్ నిధుల నుంచి పాలక వర్గం కోటి 20 లక్షల నిధులు కేటాయించగా అభివృద్ధి పనుల పేరుతో సొసైటీ నుంచి పాలక వర్గం ఫండ్ దండుకొన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 11వ వార్డులో శ్రీకర్ హాస్పిటల్ నుంచి సినీ ప్లానెట్ రోడ్డు వరకు 600 ఎంఎం డయో స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులకు 40 లక్షలు ఎంజీఎఫ్ నిధులు కేటాయించగా వాటి పై పాలవర్గం సొసైటీ సభ్యుల నుంచి ఫండ్స్ వసూల్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమగ్ర విచారణ జరపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


Similar News