ముసురుతున్న వ్యాధులు
ఆకాశానికి చిల్లులు పడ్డట్టు ఒకటే ముసురు...ఎడతెరిపిలేని వానలతో పల్లెలు, పట్టణాలన్నీ వరద నీటితో నిండిపోయాయి.
దిశ, మేడ్చల్ బ్యూరో : ఆకాశానికి చిల్లులు పడ్డట్టు ఒకటే ముసురు...ఎడతెరిపిలేని వానలతో పల్లెలు, పట్టణాలన్నీ వరద నీటితో నిండిపోయాయి. కాలనీలు, బస్తీలు మొత్తం బురదమయంగా మారాయి. రోడ్లపై ఉన్న గుంతల్లో నీళ్లు నిలిచాయి. ఇంకేముంది దోమలు విజృంభిస్తున్నాయి. జనంపై తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. వాటి ధాటికి తట్టుకోలేక మంచాన పడుతున్నారు.
ఇప్పటికే సీజనల్ వ్యాధులతో అల్లాడుతున్న మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా మూడు రోజులుగా దంచికొడుతున్న భారీ వర్షాల వల్ల జ్వరాల బారిన పడి ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. సంబంధిత అధికార యంత్రాంగం పర్యవేక్షణ లోపం అస్తవ్యస్థ పారిశుధ్య నిర్వహణ వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని విమర్శలు ప్రజల నుంచి వస్తున్నాయి.
వ్యాధులతో సుస్తీ..
జిల్లాలో వ్యాధులు ముసురుకుంటున్నాయి. డెంగీ డేంజర్ బేల్ మోగిస్తుండగా,టైఫాయిడ్, చికెన్ గున్యా, విష జ్వరాలు చాపకింద నీరులా వ్యాప్తిస్తున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 450 కిపైగా కేసులు నమోదుకాగా అనధికార లెక్కల ప్రకారం అంతకు రెట్టింపు ఉన్నట్లు సమాచారం. మేడ్చల్ మండలంలోని రావల్ కోల్ లో ఓ వ్యక్తి డెంగీ తో మృతి చెందిన విషయం విధితమే. దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, విష జ్వరాలు వంటి వ్యాధులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలో ఫీవర్ సర్వేలో భాగంగా 3,71,514 ఇళ్లను విజిట్ చేసి,13,37,450 మంది నుంచి రోగ నిర్దారణ పరీక్షలు చేయగా ఇందులో 9 వేలకు పైగా ప్రజలు జ్వరంతో బాధపడుతున్నట్లు తేలింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రులకు జనం బారులు తీరుతున్నారు.
వైద్యం కోసం రూ. లక్షల్లో ఖర్చు చెస్తున్నారు. వ్యాధుల నివారణ,మెరుగైన వైద్యం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నా వైద్యరోగ్యశాఖ ప్రకటనలకు, క్షేత్ర స్థాయిలో అమలుకు పొంతన ఉండడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం అలియాబాద్, శామీర్ పేట ఆసుపత్రులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వైద్యారోగ్య అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం విధితమే. ఆసుపత్రుల నిర్వహణ, హాజరు పట్టిక,రికార్డుల నిర్వహణ, రోగులకు అందిస్తున్న సేవలపై కలెక్టర్ తీవ్ర ఆసంతృప్తి వ్యక్తంచేశారు. అయితే జిల్లాలోని చాలా వరకు ఆసుపత్రుల నిర్వహణ ఇలాగే ఉంటుందని, కొన్ని ఆసుపత్రులలో వైద్యులు, సిబ్బంది, మందులు అందుబాటులో ఉండడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తం
జిల్లాలోని 61 గ్రామాల్లో స్పెషల్ అధికారుల పాలన కొనసాగుతోంది. ప్రత్యేక అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో పారిశుధ్యం అస్తవ్యస్థంగా తయారైంది. దీంతో దోమలు వృద్ది చెంది, ప్రజలను కాటేస్తున్నాయి. తద్వారా గ్రామీణులు మంచాన పడుతున్నారు. అదేవిధంగా మున్సిపాలిటీలలోని గుంతల రోడ్లలో వర్షపు నీరు నిలిచిపోవడం..,డ్రైనేజీలలో దోమలు వృద్ది చెంది రోగాలకు కారకులవుతున్నాయి. దోమల నివారణకు ఫాగింగ్ నామమత్రంగా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీనికి తోడు జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమలున్నాయి.
పరిశ్రమలు విడుదల చేస్తున్న వ్యర్థాలు డ్రైనేజీలు, చెరువులలో కలుస్తుండడంతో దోమల వృద్ది వేగంగా జరుగుతోంది. ఇప్పటికే నాలుగు వందలకు పైగా డెంగీ వ్యాధులు ప్రబలాయంటే పరిస్థితి ఇట్టే అర్థమవుతోంది. డెంగీ సోకుతుండడతో జనం బెంబేలెత్తుతున్నారు. ఈ వ్యాధి సోకిన వారు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో పాటు మరణాలు కూడా సంభవిస్తుండడంతో జనం ఆందోళన మరింత పెరిగిపోతుంది. పైగా డెంగీ కోసం కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులలో చేరితే రూ.లక్షల్లో ఖర్చువుతుందని శామీర్ పేటకు చెందిన దిలీప్ పేర్కొన్నారు. ఇప్పటికైనా వర్షాకాలం వ్యాధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.