డంపింగ్ యార్డును ఎత్తివేయాలని ధర్నా..స్తంభించిన ట్రాఫిక్

కాప్రా సర్కిల్ పరిధిలోని సాకేత్ సమీపంలో వెలసిన డంపింగ్

Update: 2024-08-18 11:44 GMT

దిశ, కాప్రా : కాప్రా సర్కిల్ పరిధిలోని సాకేత్ సమీపంలో వెలసిన డంపింగ్ యార్డును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కాలనీవాసులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పలు మార్లు ఇక్కడి డంపింగ్ యార్డును ఎత్తివేయాలని అధికారులకు వినతి చేసినా ఫలితం లేకపోవడంతో ధర్నా చేపట్టారు. సుమారు 15 కాలనీల వాసులు డంపింగ్ యార్డు సమస్యతో సతమతమైతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు పక్కనే వెలిసిన డంపింగ్ యార్డు కారణంగా దుర్వాసన వ్యాపిస్తోందని కాలనీల్లో ఉండలేకపోతున్నామన్నారు. అసలే జవహర్ నగర్ డంపింగ్ యార్డుతో ఇబ్బందుకు గురవుతుంటే , కాలనీల సమీపంలోనే సాకేత్ నుంచి దమ్మాయిగూడ వెళ్లే ప్రధాన రహాదారి పక్కనే డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.

ప్రైవేటు స్థలంలో చెత్త కేంద్రాన్ని ఏర్పాటు చేయడంపై కాలనీ ప్రతినిధులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ప్రభుత్వ స్థలమంటూ అధికారులు, కాదు ఇది ప్రైవేటు స్థలమని పలువురు కొర్డును ఆశ్రయించారు. ఈ స్థల వివాదం కొనసాగుతుండగా తాజాగా డంపింగ్ సమస్యపై స్థానికులు ఆందోళన చేపడుతున్నారు. వెంటనే అక్కడి డంపింగ్ యార్డును ఎత్తివేయాలని లేని పక్షంలో తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాలనీవాసుల ఆందోళనతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో జవహర్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అధికారులతో చర్చిస్తామని చెప్పి కాలనీవాసులకు సర్దిచెప్పి, ఆందోళన కారులను శాంతింపజేశారు. ధర్నాలో సాయిరాం నగర్ కాలనీ ప్రతినిధులు అశోక్ గౌడ్, పద్మారెడ్డి, కొండల్ గౌడ్ తో పాటు పలు కాలనీల ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.


Similar News