ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు తప్పవు: అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి

ఆమె మహిళా ఎన్‌ఆర్ఐ.. ‘లక్ష్మి శ్రీనివాస్’ పేరిట ఓ కనస్ట్రక్షన్ సంస్థను ఏర్పాటు చేసి రెరా, మున్సిపల్, రెవెన్యూ యాక్టు లకు తూట్లు పొడిచారు.

Update: 2024-07-13 02:45 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : ఆమె మహిళా ఎన్‌ఆర్ఐ.. ‘లక్ష్మి శ్రీనివాస్’ పేరిట ఓ కనస్ట్రక్షన్ సంస్థను ఏర్పాటు చేసి రెరా, మున్సిపల్, రెవెన్యూ యాక్టు లకు తూట్లు పొడిచారు. ప్రభుత్వ, చెరువు శిఖం స్థలాలను కబ్జా చేసి 208 విల్లాలను ఇప్పటికే నిర్మించేశారు. కొత్తగా సర్కార్ స్థలంలో మరో 17 విల్లాను నిర్మిస్తున్నారు. అయితే ‘దిశ’ దినపత్రికలో వరుస కథనాలు రావడంతో..రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. కొత్తగా కడుతున్న విల్లాలు ప్రభుత్వ స్థలమని గుర్తించి, సూచిక బోర్డులను ఏర్పాటు చేసింది. అయితే రెవెన్యూ ఏర్పాటు చేసిన సూచిక బోర్డు రాత్రికి రాత్రే మాయమవడం గమనార్హం. బిల్డర్ తాలుకే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది.

అక్రమాల్లో దిట్ట..

అక్రమాల్లో ఆరితేరిన కొందరు మగ మహారాజులను తలదన్నేలా ఎన్‌ఆర్ఐ లేడీ బాస్ భారీ అక్రమాలకు తెరలేపారు. పట్టణ ప్రణాళిక నిబంధనలను తుంగలో తొక్కారు. మల్లంపేట సర్వే నెంబర్ 170/3, 170/4,170/5లో తనకు అందుబాటులో ఉన్న 3.20ఎకరాల్లో ట్రిప్లెక్స్ విల్లాల నిర్మాణం కోసం హెచ్ఎండీఏకు వేర్వేరుగా దరఖాస్తులు పెట్టుకున్నారు. అందులో ఒకటి 35 విల్లాల నిర్మాణానికి (6,418 చదరపు గజాల్లో), మరొకటి 30 విల్లాల నిర్మాణానికి (5,394 చదరపు గజాల్లో) వాటికి హెచ్ఎండీఏ అనుమతులు ఇచ్చింది. ఆ స్థలంలో రోడ్లు, ఖాళీ స్థలాలను వదిలి 65 ట్రిప్లెక్స్ విల్లాలను నిర్మించాల్సి ఉండగా, ఏకంగా 208 విల్లాలను అక్రమంగా నిర్మించినట్లు గుర్తించారు. దీనికి తోడు తాజాగా సర్వే నెంబర్ 170/5 ఎక్ట్సెంట్ చూపుతూ సర్వే నెంబర్ 170/1లోని 2946.07 చదరపు గజాల ప్రభుత్వ స్థలంలో హెచ్ఎండీఏ అనుమతులు తీసుకోని 17 విల్లాలను నిర్మిస్తోంది. అయితే ‘దిశ’లో వస్తున్న కథనాలతో గురువారం దుండిగల్ మండల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలమని బోర్డు పెట్టారు. అయితే శుక్రవారం ఉదయం రెవెన్యూ ఏర్పాటు చేసిన బోర్డులను మాయం చేశారు.

అంతా మాయ..

హెచ్ఎండీఏ అనుమతులతో నిర్మించిన విల్లాల పక్కనే మరో 15 ఎకరాల వరకు స్థలం ఉంది. దీని అనుకొని కత్వా చెరువు ఉంది. ఆ 15 ఎకరాల్లో మల్లంపేట గ్రామ పంచాయతీ అప్పటి ఈఓ పేరుతో సుమారు 202 డూప్లెక్స్ విల్లాలకు అనుమతులు ఇచ్చినట్లుగాను, ఈఓగా వచ్చిన మరొకరి పేరుతో మరో 65 ట్రిప్లెక్స్ విల్లా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినట్లుగా పేర్కొంటున్నారు. 2018 ఏప్రిల్ నుంచి జూలై సమయంలో పంచాయతీ అనుమతులు పొంది, అందులో కోటిన్నరకు పైగా రుసుం చెల్లించినట్లుగా చెబుతున్నారు. కానీ ఫీజులు ప్రభుత్వ ఖాతాలో జమ కాలేదు. ఇటీవల రికార్డులను తనిఖీ చేయగా అనుమతులిచ్చినట్టు పత్రాలే లేని విషయం వెలుగులోకి వచ్చింది. అసలు పంచాయితీలకు విల్లాలకు అనుమతులిచ్చే అధికారమే లేదు. కేవలం 3.20ఎకరాల్లో విల్లాల అనుమతులకు హెచ్ఎండీఏ అనుమతులు తీసుకొని, మరో 15 ఎకరాల్లో అక్రమంగా 260 విల్లాలను అంటే మొత్తం 325 విల్లాలు నిర్మించారు. పక్కనే కత్వా చెరువులోని ఎఫ్ టీఎల్ పరిధిలో 15కు పైగా డూప్లెక్స్ విల్లాలను నిర్మించారు. చెరువులో ఉన్న నీటిని మోటార్ల ద్వారా తోడి నిర్మాణాలకు వినియోగించారు. చెరువు ఒడ్డున కుర్చీ వేసుకొని ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో విల్లాలను నిర్మించిన ఘనత ఆ ఎన్‌ఆర్‌ఐ మహిళ కే దక్కిందని స్థానికులు వాపోతున్నారు.

క్రిమినల్ కేసులు తప్పవు: అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి

ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. మల్లంపేటలోని సర్వే నెంబర్ 170/5లోని ప్రభుత్వ స్థలంలో గురువారం పెట్టిన బోర్డును మాయం చేసినట్లు తెలిసింది. అక్కడే మరో సూచిక బోర్డును ఏర్పాటు చేయాలని మండల రెవెన్యూ అధికారులు ఆదేశించగా ఏర్పాటు చేశారు. అ బోర్డు తొలగించిన దుండగులను గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించామని అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి తెలిపారు. 

కే1 సీజ్ చేసిన విల్లాలు

కే1ఎ కొత్తగా సర్కార్ జాగాలో నిర్మిస్తున్న విల్లాలు

కే1బి ..గురువారం రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన సూచిక బోర్డు

కే1సి మాయమైన బోర్డు

కే1డి ఉన్నతాధికారుల ఆదేశాలతో మరోసారి ఏర్పాటు చేసిన బోర్డు


Similar News