మాజీ మంత్రి హరీష్ రావు పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

రైతు ఆత్మహత్యకు కారకుడైన మాజీ మంత్రి హరీష్ రావు పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

Update: 2024-09-08 14:43 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : రైతు ఆత్మహత్యకు కారకుడైన మాజీ మంత్రి హరీష్ రావు పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు ఆదివారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో వివరాల ప్రకారం మేడ్చల్ లో రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య పై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడిన తీరు రైతులను రెచ్చగొట్టే విధంగా ఉందని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ పై తప్పుడు ప్రచారం చేస్తూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారని తెలిపారు. 2014, 2018 లో గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన విధి, విధానాలను ప్రాతిపదికగా తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

రుణమాఫీ ప్రక్రియ ఇంకా పూర్తికాకుండా రైతులను రెచ్చగొట్టేలా, ప్రజల్లోకి ప్రభుత్వం పై తప్పుడు సంకేతాలు వెళ్లేలా హరీష్ రావు మాట్లాడారని తెలిపారు. మేడ్చల్ లో జరిగిన సురేందర్ రెడ్డి ఆత్మహత్య విషయంలో నిజానిజాలు దాచి పెట్టి ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, చనిపోయిన సురేందర్ రెడ్డి కుటుంబంలో వారి తల్లికి రూ.1 లక్ష 50 వేల రుణమాఫీ జరిగిందన్నారు. రుణమాఫీ కానివారి వివరాలను సేకరించి వారికి రుణమాఫీ జరిగేలా అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కానీ ఇక రుణమాఫీ జరగదు అనేలా హరీష్ రావు మాట్లాడిన తీరుతో రైతుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసి వారిని ఆత్మహత్యకు పురి గోల్పేలా ఉందన్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం నేరపూరిత కుట్ర 61(2), ఆత్మహత్యకు ప్రేరేపణ సెక్షన్ 108 ప్రకారం హరీష్ రావు పై క్రిమినల్ కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంపీ కిరణ్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు.


Similar News