కేసులు పెట్టినా ఆగని పనులు.. రాత్రిపూట అక్రమ విల్లాల నిర్మాణాలు
విలువైన సర్కారీ స్థలాలను కాజేస్తున్నారు. ప్రభుత్వం పెట్టిన హెచ్చరిక బోర్డులను మాయం చేస్తున్నారు.
దిశ, మేడ్చల్ బ్యూరో/దుండిగల్ : విలువైన సర్కారీ స్థలాలను కాజేస్తున్నారు. ప్రభుత్వం పెట్టిన హెచ్చరిక బోర్డులను మాయం చేస్తున్నారు. సెలవు దినాల్లో గుండాలను కాపలా పెట్టి..రాత్రికి రాత్రే అక్రమంగా విల్లాలను నిర్మిస్తున్నారు. పోలీస్ కేసులు సైతం లెక్క చేయడం లేదు. అధికార పార్టీ నేతల బలం..కొందరు ఆఫీసర్ల అండదండలతో యథేచ్చగా రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అక్రమించి నిర్మాణాలు సాగిస్తున్నారు. మేడ్చల్ జిల్లా, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట లోని సర్వేనెంబర్ 170 లో రూ.25 కోట్ల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి విల్లాల నిర్మాణాలు చేపడుతున్నా యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి.
తప్పుడు పత్రాలు..హెచ్ఎండీఏ అనుమతులు..
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట రెవెన్యూ సర్వేనెంబర్ 170/5 ఎక్ట్సెంట్ చూపుతూ సర్వేనెంబర్ 170/1లో 2946.07 చదరపు గజాల ప్రభుత్వ భూమిలో ‘లక్ష్మిశ్రీనివాస్’ కన్స్ట్రక్షన్ సంస్థ 17 విల్లాలను నిర్మిస్తోంది. ప్రభుత్వ భూమిలో వైడ్ నెంబర్. 002095/ హెచ్ఎండీఏ/0433/ఎంఈడి/2023 పేరిట 2023, మే 4న 17 విల్లాలకు హెచ్ఎండీఏ అనుమతులు ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. అయితే ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతుండడంతో ఫిర్యాదులు అందుకున్న రెవెన్యూ అధికారులు 2024, మార్చిలో సదరు అక్రమ నిర్మాణాలు జేసీబీ సాయంతో కూల్చివేశారు. అంతేకాకుండా జాయింట్ సర్వే నిర్వహించి హెచ్ఎండీఏ అనుమతులు రద్దు చేయాలంటూ 2024, ఏప్రిల్ 15న దుండిగల్ తహశీల్దార్, హెచ్ఎండీఏ కమిషనర్‌కు లేఖ కూడా రాశారు.
అయితే అప్పటికే ప్రభుత్వ స్థలంలో విల్లాల కోసం కస్టమర్ల దగ్గర లక్ష్మి శ్రీనివాస్ సంస్థ రూ.కోట్లలో డబ్బులు వసూలు చేసింది. దీంతో ఈ ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేసి పరువు నిలబెట్టుకోవాలని నిర్మాణ సంస్థ చూస్తోంది. స్థానిక అధికార పార్టీకి చెందిన ఓ నేత అండతో ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి చేస్తుంది. ఎవరైనా అధికారులు అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లితే..సదరు నేత సదరు అధికారిని బదిలీ చేయిస్తానని బెదిరింపులకు దిగుతున్నారని వాపోతున్నారు. ఓ వైపు ప్రభుత్వ స్థలాలు కాపాడలంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఇస్తున్న ఆదేశాలను అధికార పార్టీలతో పాటు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. వెరసి భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. రాత్రికిరాత్రే అక్రమ నిర్మాణాలను చేపడుతూ తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు.
కేసులకే పరిమితం..చర్యలు శూన్యం..
2021లో పంచాయితీ అధికారులను మ్యానేజ్ చేసి ‘విహానా వెంచర్స్’ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పేరిట ఫోర్జరీ సంతకాలతో అక్రమనిర్మాణాలు చేపట్టడంతో సంస్థ యజమానిపై అప్పట్లో పలు కేసులు నమోదయ్యాయి. అయినా నిర్మాణ సంస్థ యాజమాన్యం పై చర్యలు తీసుకోకపోవడంతో..తీరుమారడంలేదు. గత ఫిబ్రవరి నెలలో కాలనీలోని పార్క్ స్థలాన్ని ఆక్రమించేందుకు జేసీబీ సాయంతో ఆటవస్తువులను కూల్చివేసి అడ్డు వచ్చిన మహిళపై దాడులకు దిగడంతో కాలనీవాసులు దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సంస్థ యాజమాన్యంపై పలు కేసులు నమోదయ్యాయి. ఇదిలావుంటే తాజాగా రూ.25 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలంలో తప్పుడు పత్రాలు సృష్టించి 17 విల్లాలకు హెచ్ఎండీఏలో అనుమతులు పొంది యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా..ప్రభుత్వ యంత్రాంగం కట్టడి చేయలేకపోతుంది.
బోర్డులు పీకేసి..
లక్ష్మి శ్రీనివాస్ నిర్మాణ సంస్థ తప్పుడు పత్రాలతో హెచ్ఎండీఏ అనుమతులు పొందిన సర్వేనెంబర్ 170/6 స్థలంలో రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు తరచూ మాయమవుతున్నాయి. జూలై నెల 6న ఏర్పాటు చేసిన ప్రభుత్వ సూచిక బోర్డును భూ కబ్జాదారులు పీకేశారు. విలువైన ప్రభుత్వ స్థలాన్ని రక్షించాలని స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికార యంత్రాంగం స్పందించకపోవడంతో ‘దిశ’ పత్రిక దృష్టికి తీసుకురాగా, లక్ష్మి శ్రీనివాస్ నిర్మాణ సంస్థ చేస్తున్న మోసాలపై పతాక శీర్షికన వరుస కథనాలు ‘దిశ లో ప్రచురించింది. రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. ఈ నెల 11న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తూ చర్యలుంటాయని హెచ్చరిక బోర్డును పెట్టారు. మరుసటి రోజునే దుండగలు రెవెన్యూ యంత్రాంగం పెట్టిన సూచిక బోర్డును మాయం చేశారు. దీంతో 12న ‘దిశ’ ప్రభుత్వ సూచిక బోర్డు మాయం ‘కథనాన్ని వెబ్‌లో ప్రచురించింది. స్పందించిన రెవెన్యూ అధికారులు ఆఘమేఘాల మీద మరోసారి ఆ స్థలంలో బోర్డును ఏర్పాటు చేశారు.
మూడోసారి అనగా జూలై 26న రాత్రి ప్రభుత్వ హెచ్చరిక బోర్డును మరోసారి భూ కబ్జాదారులు మాయం చేసేశారు. బోర్డు మాయమైన విషయాన్ని గమనించిన స్థానికులు శనివారం మరోసారి ‘దిశ’ ప్రతినిధి దృష్టికి తీసుకువెళ్లగా, విషయం దుండిగల్ గండిమైసమ్మ మండల తహశీల్దార్ అబ్దుల్ సయ్యద్ మతీన్ దృష్టికి వెళ్లింది. తహశీల్దార్ సూచన మేరకు అదే రోజు సాయంత్రం ముచ్చటగా మూడవ సారి రెవెన్యూ సిబ్బంది బోర్డును ఏర్పాటు చేశారు. అయితే మింగుడుపడని లక్ష్మి శ్రీనివాస్ నిర్మాణ సంస్థ యాజమాన్యం వారం రోజుల పాటు వేచి చూసింది. వారం తిరక్కుండానే రెండు రోజుల క్రితం (శుక్ర, శనివారాల్లో) రాత్రిపూట పెద్ద ఎత్తున ప్రైవేట్ వ్యక్తులను కాపలా పెట్టి ప్రభుత్వ స్థలమని హెచ్చరిక బోర్డు పెట్టిన స్థలంలో విల్లాల నిర్మాణం కోసం ఫిల్లర్లు నిర్మిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై స్థానికులు వీడియోలు, ఫోటోలు తీసి రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందా..? అక్రమార్కులకు అండగా నిలుస్తుందా..? వేచిచూడాల్సిందే.