హైడ్రా క్లారిటీ..? కాంగ్రెస్ పార్టీ హామీ..!

హైదరాబాద్‌లో హైడ్రా దూకుడు ఆగడం లేదు.

Update: 2024-09-09 14:51 GMT

దిశ, జవహర్ నగర్ : హైదరాబాద్‌లో హైడ్రా దూకుడు ఆగడం లేదు. చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను కూలుస్తూ.. ఆక్రమణదారులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఎటువంటి అనుమతలు తీసుకోకుండా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన బడాబాబులను హైడ్రా వదలడం లేదు. ఇదే సమయంలో సామాన్యుల ఇళ్లను హైడ్రా కూలుస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం పేద, మధ్య తరగతి ప్రజల నిర్మాణాలను తాము కూల్చడం లేదని స్పష్టం చేసిన విషయం తెల్సిందే. అయినప్పటికీ కొన్నిచోట్ల పేద, మధ్య తరగతి ప్రజలు నివాసం ఉంటున్న గృహాలను కూలుస్తున్నారంటూ వస్తున్న వార్తల పై జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది.

ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హామీ..!

జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోనూ కూల్చివేతలు చేపడతారని వార్తలు వస్తుండటంతో కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సామాన్య ప్రజలు ఇప్పటికే నివాసం ఉంటున్న గృహాలను హైడ్రా కూల్చబోదని ప్రకటన చేశారు. ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణంలో ఉన్న కట్టడాలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారని శ్రీకాంత్ పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల నిర్మాణాలను హైడ్రా కూల్చడం లేదని స్పష్టం చేశారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ ప్రాంతంలో ప్రభుత్వం హైడ్రా పేరిట పేదప్రజల ఇండ్లను కూల్చి, నిరాశ్రయులను చేస్తదని కొంతమంది ముసుగువీరులు పేదప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడు పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి దిశగా ఆలోచనలు రూపొందిస్తోందన్నారు. మాయమాటలు చెబుతున్న వారి ఉచ్చులో ప్రజలెవ్వరు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. అమాయక పేద ప్రజలను ఆసరాగా చేసుకుని కొంతమంది ఆర్థిక, రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని, వారి ఆటలు ప్రజాపాలనలో సాగబోవని హెచ్చరించారు. ప్రజలను మభ్యపెడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వారికి తగిన బుద్ధి చెప్తామని అన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజా ప్రభుత్వంలో పేదలకు అండగా కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి ఉంటారని హామీ ఇచ్చారు.


Similar News