ఒకే రోజు అమీర్‌పేట్, కూకట్‌పల్లిలో విద్యార్థుల ఆందోళన...
మూడు సంవత్సరాల కోర్సు, ఇంటర్ ఏదైనా గ్రూప్ చదువుకున్న ఒకేషనల్ కోర్సులలో శిక్షణ ఇచ్చి మంచి ఉద్యోగం కల్పిస్తామని, నమ్మించి ఏఐఎంఎంఎస్ (అమృత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ మెడికల్ సైన్స్) ఇనిస్టిట్యూట్ తమను మోసం చేసిందని ఆరోపిస్తు విద్యార్థులు వంద మంది సోమవారం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు.
దిశ, కూకట్పల్లి : మూడు సంవత్సరాల కోర్సు, ఇంటర్ ఏదైనా గ్రూప్ చదువుకున్న ఒకేషనల్ కోర్సులలో శిక్షణ ఇచ్చి మంచి ఉద్యోగం కల్పిస్తామని నమ్మించి ఏఐఎంఎంఎస్ (అమృత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ మెడికల్ సైన్స్) ఇనిస్టిట్యూట్ తమను మోసం చేసిందని ఆరోపిస్తు విద్యార్థులు వంద మంది సోమవారం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. బాధిత విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీ సప్తగిరి కాంప్లెక్స్‌లోని మూడవ అంతస్థులో ఏఐఎంఎంఎస్ (అమృత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ మెడికల్ సైన్స్) ఇనిస్టిట్యూట్ పేరుతో గత మూడు సంవత్సరాల క్రితం సంస్థను ఏర్పాటు చేశారు. వీరికి కూకట్‌పల్లితో పాటు అమీర్‌పేట్, మెహిదీపట్నం ప్రాంతాలలో బ్రాంచీలు ఉన్నాయి. ఏఐఎంఎంఎస్ ఇనిస్టిట్యూట్‌లో పారామెడికల్ డిగ్రీ, డిప్లొమ కోర్సులు అందిస్తున్నట్టు, అందులో బివోక్–రేడియాలజి అండ్ మెడికల్ ఇమేజింగ్, బివోక్– మెడికల్ లాబ్ టెక్నాలజి, బివోక్–కార్డియక్ కేర్ టెక్నాలజి, బీవోక్–ఆపరేషన్ థియేటర్ టెక్నాలజి, బివోక్–ఆప్టోమెటరి టెక్నాలజి, బివోక్–డయాలసిస్ టెక్నాలజి కోర్సులు మూడు సంవత్సరాల కాలపరిమితి, ఇంటర్ అర్హత ఉన్న వారికి శిక్షణ ఇస్తామని నమ్మించి కోర్సులలో జాయిన్ చేసుకున్నారు.
కోర్సులలో చేరుతున్న సమయంలో తమ ఇన్స్టిట్యూట్కు యూజిసి, గవర్నమెంట్ ఆఫ్ ఇండి రికగ్నైజేషన్ సర్టిఫికేట్ ఉంది, వంద శాతం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నమ్మించారు. ఇదిలా ఉండగా మెహిదిపట్నం బ్రాంచిలో విద్యార్థులు కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉద్యోగాల కోసం వెళితే ఏఐఎంఎంఎస్ సంస్థ నుంచి తీసుకున్న సర్టిఫికేట్లు వాలిడ్ కావని, ఇనిస్టిట్యూట్‌కు రిజిస్ట్రేషన్ లేదని తేలడంతో మెహిదిపట్నం, అమీర్ పేట్ బ్రాంచిలలో గొడవ జరిగింది. గత వారం రోజులుగా రెండు బ్రాంచిలతో పాటు ఆ సమాచారం అందుకున్న కూకట్పల్లి బ్రాంచి విద్యార్థులు తమ సర్టిఫికేట్లు, డబ్బులు తిరిగి ఇవ్వండి ఏఐఎంఎంఎస్లో తాము కొనసాగమంటు యాజమాన్యానికి విన్నవించుకుంటు వస్తున్నారు. దీంతో సోమవారం సంస్థ కార్యాలయంలో విద్యార్థులు ప్రిన్సిపాల్, సిబ్బందిని నిర్భందించడంతో వారు 100 నంబర్‌కు డయల్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో సంస్థ ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థులు కూకట్పల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. కోర్సులో చేరిన వారికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా కౌన్సిలింగ్ నిర్వహించారని, ఒకరి వద్ద ఏడాదికి 65 వేలు, 70 వేలు, 80 వేలు, లక్షల రూపాయల వరకు ఇష్టారీతిగా డబ్బులు వసూలు చేసినట్టు విద్యార్థులు తిలోత్తమ, అనురాధలు ఆరోపించారు.
కూకట్పల్లి బ్రాంచిలో మొత్తం సుమారు మూడు వందల మంది విద్యార్థులు తమ భవిష్యత్తు ఏంటా అని భయపడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులతో పాటు వారి తల్లి తండ్రులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీస్ స్టేషన్ ఆవరణలో గంటల కొద్ది వేచి చూశారు. విద్యార్థుల నుంచి స్వీకరించిన ఫిర్యాదుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తామని సీఐ ముత్తు తెలిపారు. కాగా ఈ నెల 25వ తేది నాడు తమ సంస్థ చైర్మన్ అల్లాబక్ష్ వస్తున్నారు. విద్యార్థులతో మాట్లాడి వారిని సముదాయిస్తాము సమయం ఇవ్వాలని ఏఐఎంఎంఎస్ సంస్థ ప్రిన్సిపాల్ ఝాన్సి పోలీసులతో కోరారు. ఇదిలా ఉండగా కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో విద్యార్థుల ఆందోళన కార్యక్రమం, ఫిర్యాదు తతంగం జరుగుతుండగా అదే సమయంలో అమీర్‌పేట్ బ్రాంచిలో విద్యార్థులు గొడవ చేయడం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏఐఎంఎంఎస్ సంస్థ చైర్మన్ అల్లాబక్ష్ మరి కొంత మంది సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది. దీంతో కూకట్పల్లి పోలీసులు పంజాగుట్ట పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని అనే విషయాన్ని వాకబు చేస్తున్నారు. ఏఐఎంఎంఎస్ సంస్థ పై తాము ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై ఉన్నతాధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.