అనురాగ్ యూనివర్సిటీ పై కేసుల మీద కేసులు

ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామంలోని నాడెం చెరువు బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాల వివాదం జనగాం ఎమ్మెల్యే, అనురాగ్ విద్యాసంస్థల చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మెడకు ఉచ్చులా బిగిస్తోంది.

Update: 2024-08-31 11:07 GMT

దిశ,ఘట్కేసర్ : ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామంలోని నాడెం చెరువు బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాల వివాదం జనగాం ఎమ్మెల్యే, అనురాగ్ విద్యాసంస్థల చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మెడకు ఉచ్చులా బిగిస్తోంది. వారం రోజుల్లోనే ఇరిగేషన్ శాఖ గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్, అనురాగ్ విద్యా సంస్థలపై రెండుసార్లు పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. హైడ్రా కూల్చివేతలు జరపకుండా కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. నాడెం చెరువు బఫర్ జోన్ లో నిర్మాణాలను కాపాడుకునేందుకు యూనివర్సిటీ యాజమాన్యం విశ్వ ప్రయత్నాలు చేసింది. హైడ్రా ఎప్పుడైనా అక్రమ నిర్మాణాలు కూల్చివేసే అవకాశం కనిపిస్తోంది. హైడ్రా అధికారులు ఎప్పుడు నిర్మాణాలను కూల్చివేస్తారని వణికిపోతున్నారు.

     అసలు నాడెం చెరువు బఫర్ జోన్ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల వివరాల్లోకి వెళితే....వెంకటాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్ 814, 815, 816 లలో 60 ఎకరాల్లో నాడెం చెరువు ఉంది. అయితే సర్వేనెంబర్ 813లో నాడెం చెరువు బఫర్ జోన్ మూడు ఎకరాల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి నీలిమ మెడికల్ కాలేజీ, నీలిమ ఆసుపత్రి నిర్మించినట్లు ఫిబ్రవరి నెలలో బంజారా హక్కుల పోరాట సంఘం నాయకుడు గణేష్ నాయక్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్కు, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కోర్టు ను ఆశ్రయించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా ఏజెన్సీని ఏర్పాటు చేసింది. హైడ్రా దూకుడుకి వణుకు పుట్టిన అనురాగ్ సంస్థల యాజమాన్యం కోర్టును ఆశ్రయించడం ప్రారంభించింది. చెరువు పరిసర ప్రాంతాల్లో వీడియోలు తీసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులను, ఇతర వ్యక్తులపై దాడులకు దిగింది. ఉస్మానియా యూనివర్సిటీ లా విద్యార్థి యూట్యూబర్ సురేష్ యాదవ్ ఇటీవల అనురాగ్ విద్యా సంస్థల ప్రతినిధులు, సిబ్బంది తనపై దాడి చేశారని పోచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బఫర్ జోన్లు అక్రమ నిర్మాణాలు కూల్చివేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ కోర్టు మెట్లు ఎక్కినా ఫలితం లేకుండా పోయింది.

తూము ధ్వంసం....

కోర్టు నుంచి ఎలాంటి ఉపశమనం లభించకపోవడంతో నాడెం చెరువులోని నీటిని బయటికి పంపించేందుకు తూము గేటును గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. నిత్యం వాహన రాకపోకులతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో జేసీబీ సాయంతో ధ్వంసం చేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. గతంలో వెంకటాపూర్ గ్రామ సర్వేనెంబర్ 813లోని బఫర్ జోన్ లో అనురాగ్ విద్యాసంస్థలు, మెడికల్ కళాశాల నిర్మించారని ఇరిగేషన్ అధికారులు పోచారం ఐటీ కారీడార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

     శుక్రవారం అర్ధరాత్రి నాడెం చెరువు గేట్లను ధ్వంసం చేయడంతో మరోసారి ఇరిగేషన్ అధికారులు అనురాగ్ విద్యాసంస్థలపై ఫిర్యాదు చేశారు. అయితే అనురాగ్ కళాశాల ఎదురుగానే ఈ తూము ఉండడం, కళాశాలలోని సీసీటీవీలు పని చేయట్లేదు అని సెక్యూరిటీ సిబ్బంది చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇరిగేషన్ శాఖ ఏఈ పరమేష్ , రెవెన్యూ ఇన్స్పెక్టర్ కావ్య, పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ సీఐ రాజు నాడెం చెరువు తూమును పరిశీలించారు. అనురాగ్​ విద్యా సంస్థల సిబ్బంది తూము ధ్వంసం చేసినట్లుగా అనుమానంతో ఇరిగేషన్ శాఖ ఏఈ పరమేష్ మరోసారి పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  

Tags:    

Similar News