ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు.. చెరువు బఫర్ జోన్ లో కాలేజీల నిర్మాణం
దిశ, ఘట్కేసర్ః అనురాగ్ యూనివర్సిటీ చైర్మన్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై రాచకొండ పోలీస్ కమిషనరేట్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. వివరాలకు వెళ్తే... మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామం సర్వే నెంబర్ 813 లోని నాడెం చెరువు బఫర్ జోన్ లో అనురాగ్ యూనివర్సిటీ, నీలిమ మెడికల్ కాలేజ్, నీలిమ ఆసుపత్రి నిర్మించారని నంగారాబేరి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గణేష్ నాయక్ గతంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్, రెవెన్యూ శాఖ అధికారులకు, ఇరిగేషన్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు ఎవరు స్పందించకపోవడంతో గణేష్ నాయక్ హైకోర్టును ఆశ్రయించాడు. పూర్తి విచారణ అనంతరం హైకోర్టు ద్వారా అనురాగ్ యూనివర్సిటీ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు వెలువడే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన ఇరిగేషన్ శాఖ అధికారులు ముందస్తుగా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ లో అనురాగ్ యూనివర్సిటీ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.