యథేచ్ఛగా అక్రమ నిర్మాణం.. చోద్యం చూస్తున్న మున్సిపల్ యంత్రాంగం
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో అక్రమార్కుల రాజ్యం
దిశ,కుత్బుల్లాపూర్ : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో అక్రమార్కుల రాజ్యం విరాజిల్లుతుంది.ఎలాంటి అనుమతులు, కనీస నిబంధనలు పాటించకుండా ఎంత కావాలంటే అంత తమ ఇష్టానుసారం బిల్డింగ్స్ కడుతూ అక్రమ నిర్మాణదారులు అధికారిక వ్యవస్థలకు సవాల్ విసురుతున్నారు. తాజాగా నిజాంపేట్ పూర్వ గ్రామ పంచాయతీ ఎదురుగా ఓ నిర్మాణదారుడు భారీ స్థాయిలో బిల్డింగ్ చట్ట విరుద్దంగా నిర్మిస్తున్నాడు. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డును సైతం ఆక్రమిస్తూ జీరో సెట్ బ్యాక్ తో అయిదు ఫ్లోర్స్ బిల్డింగ్ నిర్మిస్తున్నాడు.ఈ భవన నిర్మాణం పూర్తి అవుతే ప్రజలకు రోడ్డు సౌకర్యం కూడా కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదు.కానీ నన్నెవరూ ఆపేది అంటూ రెచ్చిపోతూ బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేసే పనిలో సదరు నిర్మాణదారుడు నిమగ్నం అయ్యాడు.
ఈ అక్రమ బిల్డింగ్ పై చర్యలు తీసుకోవాలని పలు మార్లు ఫిర్యాదు వెళ్లిన అధికారులు పెడచెవిన పెడుతున్నట్లు సమాచారం. నిజాంపేట్ కార్పొరేషన్ లో జరిగే అక్రమ భవంతుల వెనుక ఓ ప్రజాప్రతినిధి అధికారులతో లాబియింగ్ చేయించి అక్రమాల తతంగం పూర్తి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.అక్రమార్కుల పై చర్యలు చేపట్టాల్సిన నిజాంపేట్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఫిర్యాదులు వెళుతున్న మౌనం వహిస్తుండడం తో భారీ ఎత్తున ముడుపులు అందించారనే విమర్శలు వస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ కీ ఆదాయం దేవుడెరుగు మా జేబులు నిండుగా ఉంటే చాలు అనేలా ఉంది ఇక్కడి టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు అని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ అధికారులు తమ చిత్తశుద్ధిని నిరూపించుకుని నిజాంపేట్ లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణం పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.