అడిగేదెవరు.. ఆక్రమించేద్దాం..!

అధికారుల ఉదాసీనత.. ఆక్రమణదారుల స్వార్థం.. వెరసి అల్వాల్ లో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో రెవెన్యూ యంత్రాంగం విఫలమవుతోంది.

Update: 2024-09-28 14:09 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : అధికారుల ఉదాసీనత.. ఆక్రమణదారుల స్వార్థం.. వెరసి అల్వాల్ లో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో రెవెన్యూ యంత్రాంగం విఫలమవుతోంది. ప్రజలు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో యథేచ్చగా నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. జొన్న బండలోని యూఎల్సీ ల్యాండ్ లో జరుగుతున్న ఆక్రమణలు.. అందులో జరుగుతున్న నిర్మాణలే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. రూ.కోట్లు విలువ చేసే స్థలాలను అక్రమార్కులు కబ్జా చేసి విక్రయిస్తున్నా.. పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కబ్జాదారులతో రెవెన్యూ యంత్రాంగం కుమ్మక్కైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కొనసాగుతున్న కబ్జాల పరంపర..

అల్వాల్ లోని సర్వే నెంబర్లు 582, 583లలో ప్రభుత్వ(యూఎల్ సి) భూములు ఉన్నాయి. సర్వేనెంబర్ 582లో 15.3 ఎకరాలు ఉండగా, సర్వే నెంబర్ 583లో 12.38 ఎకరాలు, మొత్తం కలిపి 28.1 ఎకరాల మిగులు భూములు ఉన్నాయి. వీటి విలువు బహిరంగ మార్కెట్ లో రూ.350 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. కాగా ఇదే యూఎల్సీ స్థలంలోని దాదాపు నాలుగైదు ఎకరాలలో బండరాళ్లు కొట్టుకోని జీవనం సాగిస్తున్న పెద్ద కొండయ్య, చిన్న కొండయ్య అనే వ్యక్తుల తాలుకకు చెందిన సుమారు 70 కుటుంబాలు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నాయి. మిగితా 20 ఎకరాలకు పైగా మిగులు భూములను భూ కబ్జాదారులు తప్పుడు పత్రాలను సృష్టించి తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. అమాయక జనానికి విక్రయించి రూ.కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికీ ఈ స్థలంలో అపార్ట్ మెంట్లు, వాణిజ్య భవనాల నిర్మాణాలు సాగుతున్నాయి. ఓ ప్రముఖ విద్యా సంస్థ యూఎల్సీ స్థలాన్ని అక్రమించుకుంటుంది.

తప్పుదారి పట్టించే యత్నం..

భూ కబ్జాదారులు తెలివి మీరిపోయారు. యూఎల్సీ స్థలం కబ్జా పై ‘దిశ’ దినపత్రికలో వస్తున్న వరుస కథనాలతో అలర్ట్ అయ్యారు. ప్రభుత్వ స్థలంలో నివాసం ఉంటున్న పేదలకు నోటీసులు ఇచ్చి కూల్చేస్తామని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఆ 28 ఎకరాల కబ్జా స్థలంలో ఉన్నది రాళ్లు కొట్టుకొని జీవనం సాగించే పేద కుటుంబాలేనని నమ్మించే పనిలో కబ్జాదారులు నిమగ్నమయ్యారు. రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రలోభ పెట్టి పేద కుటుంబాలకే నోటీసులు ఇప్పించినట్లు సమాచారం. మిగితా కబ్జాదారులు విక్రయించిన ప్లాట్లు, ఇండ్లకు నోటీసులు ఇవ్వకుండా మేనేజ్ చేసినట్లు తెలిసింది. ఇదే క్రమంలో ఈ నెల 27న శుక్రవారం స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ వద్దకు నోటీసులు అందుకున్న పెద్ద కొండయ్య, చిన్న కొండయ్యలతో పాటు మరి కొందరని పంపించినట్లు సమాచారం. అధికారులు నోటీసులు ఇచ్చి, తమ ఇండ్లను కూల్చేస్తామని బెదిరిస్తున్నారని ఎంపీకి చెప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా బాధితుల అభ్యర్థన మేరకు ఈటల రాజేందర్ పేదల జోలికి వెళ్లొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించిన విషయం విధితమే.

అయితే భూ కబ్జాదారులు 20 ఎకరాలకు పైగా మిగులు భూములతో రియల్ ఏస్టేట్ వ్యాపారం చేసుకుంటుండగా, కేవలం నాగుగైదు ఎకరాల్లో ఇండ్లను నిర్మించుకొని జీవనం సాగించే పేద కుటుంబాలను ముందు పెడుతున్నట్లు తెలుస్తోంది. భూ కబ్జాదారులు పేదకుటుంబాలను కవచంలా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ భూములను అమ్ముకొని రూ. కోట్లలో వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం ఇటు రెవెన్యూ, అటు మున్సిపల్ అధికారులకు తెలిసినా.. పట్టనట్లు వ్యవహరిస్తుండడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు కలుగజేసుకొని విలువైన ప్రభుత్వ భూముల కబ్జాకు అడ్డుకట్ట వేయాలని, ఆ భూములను స్వాధీనం చేసుకొని ప్రజాప్రయోజనాల కోసం వినియోగించాలని స్థానికులు కోరుతున్నారు.


Similar News