‘ఐదు తరాలు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన మేడ్చల్ అడిషనల్ కలెక్టర్

Update: 2023-05-14 16:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కష్టజీవుల బతుకులను, ఉద్యమకారుల చరిత్రను రచయిత గులాబీల మల్లారెడ్డి అక్షరబద్ధం చేశారని మేడ్చల్ అడిషనల్ కలెక్టర్, ప్రముఖ సాహితీకారుడు ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. మల్లారెడ్డి రచించిన ‘ఐదు తరాలు’ పుస్తకాన్ని ఆయన నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్ హాల్ లో ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ రాబోవు తరాలకు ఈ పుస్తకం స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. మానవ జీవన పరిణామంలో భూమి కేంద్రంగానే అనేక ఉద్యమాలు, విప్లవాలు జరిగాయన్నారు. దానిని చిత్రిక పట్టిన ‘ఐదు తరాలు’ ఒక పరిశోధనాత్మక, చరిత్ర పుస్తకంగా నిలిచిపోతుందని అన్నారు. రాబోవు తరాలకు రిఫరెన్స్ గా ఉపయోగపడుతుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ సాహితీవేత్త కె. ఆనందాచారి మాట్లాడుతూ చరిత్ర పునాదుల మీదనే భవిష్యత్ నిర్మాణం జరుగుతుందని అన్నారు.

నేలతో మనిషిది విడదీయరాని సంబంధం అని, అందుకే భూమి కేంద్రంగానే మానవ జీవితం కొనసాగుతోందని అన్నారు. ఐదు తరాల పోరాట పటిమను గులాబీల మల్లారెడ్డి వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి మాట్లాడుతూ తెలంగాణ భాష, యాస, సంప్రదాయం, మాండలీకాలను పరిపుష్టం చేసిన పుస్తకాల సరసన ‘ఐదు తరాలు’ పుస్తకం తప్పక నిలుస్తుందన్నారు. ప్రముఖ రచయిత అన్నవం దేవేందర్ మాట్లాడుతూ తెలంగాణ మట్టి మనుషుల కన్నీటి గాథలే ఈ పుస్తకం అని కొనియాడారు. పుస్తక రచయిత గులాబీల మల్లారెడ్డి మాట్లాడుతూ తమ వంశంలోని ఐదు తరాల మానవీయ విలువలు, భూపోరాటాలు, కుల మత భేదాలు లేని సమ సమాజ ఆకాంక్షలు ఈ పుస్తకంలో ప్రతిఫలిస్తాయని అన్నారు. ఇంకా ఈ సమావేశంలో పాలపిట్ట పబ్లికేషన్స్​అధినేత గుడిపాటి. రచయితలు రాపోలు సుదర్శన్, ప్రయోద్ ఆవంచ, వేముల ప్రభాకర్ తదితరులు మాట్లాడారు.

Tags:    

Similar News