వనదుర్గమ్మ చెంత పెరిగిన గంగమ్మ ఉధృతి

వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది.. మంజీరా నదీ పాయలు పరవళ్ళు తొక్కుతున్నాయి.

Update: 2024-09-03 17:09 GMT

దిశ, పాపన్నపేట : వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది.. మంజీరా నదీ పాయలు పరవళ్ళు తొక్కుతున్నాయి. దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం మూడో రోజు సైతం జలదిగ్బంధంలోనే ఉంది. వనదుర్గామాత ఆలయ సమీపంలో ఉన్న వనదుర్గా ప్రాజెక్టు పూర్తిగా నిండి పొంగిపొర్లుతోంది. ప్రాజెక్టు పై నుంచి గంగమ్మ పరవళ్ళు తొక్కుతూ వనదుర్గామాత ప్రధాన ఆలయం ముందున్న ఏడు పాయల్లో ఒకటైన నదీ పాయ ఉధృతంగా ప్రవహించడంతో ఆలయానికి రాకపోకలు స్తంభించాయి.

దీంతో ఆదివారం మధ్యాహ్నం ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. రాజగోపురంలో వనదుర్గామాత ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టగానే అమ్మవారి దర్శనం యధావిధిగా పున ప్రారంభిస్తామని ఆలయ అర్చకులు, సిబ్బంది పేర్కొన్నారు. నీటి ప్రవాహం వద్దకు భక్తులు ఎవరూ వెళ్లకుండా స్థానిక ఎస్సై శ్రీనివాస్ గౌడ్ భారీకేడ్లు ఏర్పాటు చేశారు.


Similar News