దిశ, సంగారెడ్డి అర్బన్ : ఐఐటీ హైదరాబాద్ లో కేవలం పరిశోధనలు, ఇన్నోవేషన్లు కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అదిరిపోయేలా నిర్వహిస్తుంటారు. వచ్చే మే నెల 26 నుంచి జూన్ 1 వరకు ఐఐటీ హైదరాబాద్ 10వ కన్వెన్షన్ ఆఫ్ (SPIC MACAY) వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను రాష్ట్ర గవర్నర్ ఈ నెల 4న రాజ్ భవన్ లో ఆవిష్కరించారు. ఈ సంవత్సరం ఈ వేడుకల్లో భారతీయ శాస్త్రీయ సంగీతం, నృత్యాలు ఇతర కళలతో ప్రత్యేక వేదికగా నిలవనుంది. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి ఐఐటీ హైదరాబాద్ లో ప్రసిద్ధ సరోడ్ విద్వాంసుడు, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత ఉస్తాద్ అంజద్ అలీ ఖాన్ తన సంగీత ప్రదర్శన ద్వారా అందరినీ మంత్ర ముగ్ధులను చేశారు. ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీ.ఎస్.మూర్తి మాట్లాడుతూ… మే నెలలో నిర్వహించే కన్వెన్షన్ లో భాగంగా ప్రతి నెల ప్రముఖ సంగీత కళాకారులతో ప్రత్యేక ప్రదర్శనను నిర్వహిస్తామని వెల్లడించారు. శాస్త్రీయ సంగీతం వినడం, సాధన చేయడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గి మంచి వాతావరణం ఏర్పడుతుందని డైరెక్టర్ మూర్తి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.