Temple EO : ఏడుపాయల ఈవోను సస్పెండ్ చేయాలి..

రాష్ట్రంలోనే ఎంతో ప్రఖ్యాతి చెందిన ఏడుపాయల వనదుర్గమాత ఆలయంలో చోరీ జరగడం, చోరీ జరిగినా ఆలయానికి రాని ఈవో పై పలు హిందూసంఘాల నాయకులు మండిపడ్డారు.

Update: 2024-08-11 15:42 GMT

దిశ, పాపన్నపేట : రాష్ట్రంలోనే ఎంతో ప్రఖ్యాతి చెందిన ఏడుపాయల వనదుర్గమాత ఆలయంలో చోరీ జరగడం, చోరీ జరిగినా ఆలయానికి రాని ఈవో పై పలు హిందూసంఘాల నాయకులు మండిపడ్డారు. ఏడుపాయల వనదుర్గామాత క్షేత్రాన్ని పట్టించుకోని ఆలయ ఈవోను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏడుపాయల ఆలయ క్షేత్రంలో హుండీల దొంగతనంలో ఆలయ అధికారుల నిర్లక్ష్యం, ఆలయ ఈవో పర్యవేక్షణ లేకపోవడమే చోరీ జరగడానికి కారణమని బజరంగ్దళ్ మండల అధ్యక్షుడు బోలకృష్ణ ఆరోపించారు. ఆదివారం ఏడుపాయల క్షేత్రంలో బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో హుండీల దొంగతనం జరిగితే ఆలయానికి ఈవో రాకపోవడం వారి పనితనానికి నిదర్శనమన్నారు.

ఆలయంలో ఎన్నిసార్లు దొంగతనం జరిగినా దొంగలను పోలీసులు పట్టుకొని రికవరీ చేశారు. కానీ ఆలయ అధికారులు మండపానికి భద్రత, సీసీ కెమెరాలు ఏర్పాటు, సెక్యూరిటీ గార్డుల పనితీరు పరిశీలించకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. పదేపదే దొంగతనాలు జరుగుతున్నా ఆలయ అధికారులలో మాత్రం ఎలాంటి చలనం లేదన్నారు. వారి ఇండ్లలో దొంగతనం జరిగితే ఇలానే ఉంటుందా అని వారు ప్రశ్నించారు. భక్తుల సొమ్ము పలుసార్లు చోరి కావడంతో ఆలయ ప్రతిష్ట దెబ్బ తింటుందన్నారు. రూ.కోట్లల్లో ఆదాయం ఉన్న ఆలయానికి రెగ్యులర్ ఈవోను నియమించకపోవడం ప్రభుత్వ వైఫల్యం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రెగ్యులర్ ఈవోను నియమించాలని వారు కోరారు. సంఘాల నాయకులు దుర్గాప్రసాద్, శివ, చరణ్, ప్రసాద్, శంకర్, ప్రదీప్, రమేష్ తదితరులు ఉన్నారు.


Similar News