Rain : చినుకు పడితే చిత్తడే.. అధికారులూ పట్టించుకోండయ్యా..!

చిన్న చిన్న వానలకే రోడ్లన్నీ బురద మయమై చెరువులను తలపిస్తున్నాయి.

Update: 2024-08-11 11:11 GMT

దిశ, నంగునూరు : చిన్న చిన్న వానలకే రోడ్లన్నీ బురద మయమై చెరువులను తలపిస్తున్నాయి. దీంతో రోడ్ల పై వాహనాలు వెళ్తుండడంతో ఇండ్లలోకి, రోడ్డున వెళ్తున్న ప్రయాణికుల పై బురద నీళ్లు వెదజల్లుతున్నాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నంగునూరు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నంగునూరు నుండి దూల్మిట్ట మండలంలోని దోర్నాల గ్రామానికి నూతనంగా రెండు వరుసల రోడ్డు నిర్మించడానికి గత సంవత్సరం నిధులు మంజూరై రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయినప్పటికీ గ్రామం సరిహద్దుల్లో రోడ్డు మరమ్మతులు చేసినప్పటికీ గ్రామంలోని నల్లపోచమ్మ దేవాలయానికి వెళ్లే దారిలో రోడ్డు గుంతలుగా మారి నీరు నిలిచి చెరువుల తలపిస్తుంది.

ప్రధాన రోడ్డు ఊరు బయట మరమ్మతులు చేపట్టి ఊరిలో ఎలాంటి మరమ్మతుల చర్యలు తీసుకోకుండా కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహించారని, దీని పై గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు పై వాహనాలు వెళితే ఇండ్ల పైకి దారిన పోయే వారి పై బురద వెదజల్లి తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఈ దారిలో నల్ల పోచమ్మ దేవాలయం ఉండడం వల్ల ఇతర గ్రామాల నుండి అధిక సంఖ్యలో ఇక్కడికి వాహనాలు తరలివస్తుంటాయని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నల్ల పోచమ్మ గుడికి గ్రామం నుండి మహిళలు బోనాలు ఎత్తుకెళ్లాలంటే బురద నీటి నుండి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రదేశంలో ముందుగా రెండు వైపులా మురికి కాలువలు నిర్మించేలా చర్యలు తీసుకొని రోడ్డు మరమ్మతులు చేసే విధంగా సంబంధిత అధికారులు చొరవ చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.


Similar News