అందరి ఆనందమే ప్రభుత్వ ధ్యేయం
పాలనలో మార్పు కావాలని ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, ప్రతి పేదవాడి ముఖంలో ఆనందమే తమ ప్రభుత్వ లక్ష్యమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి అన్నారు.
దిశ, కంగ్టి : పాలనలో మార్పు కావాలని ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, ప్రతి పేదవాడి ముఖంలో ఆనందమే తమ ప్రభుత్వ లక్ష్యమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి అన్నారు. గురువారం కంగ్టిలోని బస్వప్రదీప్ ఫంక్షన్ హాల్లో 61 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందినవారు అనే నెపంతో ఎంతో మంది కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను ఆపారని అన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చాక 4 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న వారికి చెక్కులను లబ్ధిదారులకు అందివ్వడం జరిగిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలకతీతంగా పేద, మధ్య తరగతి ప్రజలకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చామని, ఇచ్చిన మాట ప్రకారం రైతుల రుణమాఫీ చేశామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని, కంగ్టి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కంగ్టిలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. 30 పడకల ప్రభుత్వ దవాఖాన ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ధ్యాన్ చాంద్ ని స్ఫూర్తిగా తీసుకోవాలి
అంతకు ముందు కంగ్టి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కు విద్యార్థులు గౌరవ వందనం చేశారు. విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి ధ్యాన్ చాంద్ ను స్ఫూర్తిగా తీసుకుని విద్యతో పాటు క్రీడా రంగంలో కూడా రాణించాలన్నారు. క్రీడల వలన మానసిక ఉల్లాసం, జ్ఞాపకశక్తి పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శంకర్ , ఎమ్మార్వో విష్ణు సాగర్ , డిప్యూటీ ఎమ్మార్వో జుబ్బేర్ , సీడీసీ చైర్మన్ షాదుల్ , పీఏసీఎస్ చైర్మన్ మారుతి రెడ్డి, దామ నాగన్న, నగనాథ్ సర్ , ఆయాల కమిటీ చైర్మన్ వెంకట్, బసి రెడ్డి, మాధవ్ రావు పాటిల్, మనోజ్ పాటిల్, మాజీ జెడ్పీటీసీ సర్దార్, పరశురాం, కుపెండర్, డేవిడ్, రాజు, శీను పాల్గొన్నారు.