ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు.. బదిలీ చేయించండి...
ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు అంటూ అందోల్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు రోడ్డెక్కారు.
దిశ, ఆందోల్ : ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు అంటూ అందోల్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు రోడ్డెక్కారు. శనివారం ఉదయం పాఠశాల ప్రధాన గేటు ముందు బైఠాయించారు. ప్రిన్సిపాల్ డౌన్ డౌన్, ఈ ప్రిన్సిపాల్ సద్గుణ మెరీ గ్రెస్ మాకొద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధ్యాపక బృందం సభ్యులు ఎంత నచ్చజెప్పినా వినకుండా గేటు ముందు కూర్చున్నారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో పాండు, డిప్యూటీ తహశీల్దార్ మధుకర్ రెడ్డి, సీఐ అనిల్ కుమార్ లు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థినులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రిన్సిపాల్ మాతో వెట్టి చాకిరి చేయిస్తున్నారని, ఆమె వుండే గదిని, కారును కడిగిపిస్తున్నారని, ఆమె బట్టలు కూడా తమతో శుభ్రం చేయిస్తున్నారని, అంతేకాకుండా తమని, తమకు అండగా వుండే టీచర్లను సైతం బూతు మాటలతో వ్యంగంగా తిడుతున్నారని వారు వివరించారు.
ప్రిన్సిపాల్ ఇక్కడే పని చేస్తే తాము చదువుకోలేమని, ఆమెను ఇక్కడి నుంచి బదిలీ చేయండని విద్యార్థులు పట్టుబట్టారు. మీ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీనిచ్చారు. అండగా తాము ఉంటామని ఆందోళన వద్దని, క్లాస్ రూములోకి వెళ్లాలని అధికారులు నచ్చజెప్పారు. దీంతో విద్యార్థినులు అక్కడి నుంచి లేచి గేటు లోపలికి వచ్చి సమావేశమయ్యారు. వారి వద్దకు ప్రిన్సిపాల్ సద్గుణ మేరీ గ్రెస్ చేరుకొని మాట్లాడుతూ తాను ఇక్కడి నుంచి వెళ్లిపోతానని, మీరు బాగా చదువుకోండని చెప్పారు. పీఆర్టీయూ సంఘం జిల్లా అధ్యక్షుడు మాణయ్య అక్కడికి చేరుకొని విద్యార్థినులకు మద్దతు పలికారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు సహకారం ఉంటుందన్నారు. అనంతరం విద్యార్థినులు తరగతి గదుల్లోకి వెళ్లిపోయారు.
కలెక్టర్ ఆదేశాలతో విచారణ షురూ..
గురుకుల పాఠశాలలో జరిగిన విషయాన్ని ఆర్డిఓ పాండు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆమె ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో సమావేశమయ్యారు. విద్యార్థులు ఏకరువుగా సమస్యలను ఆయన ముందు ఉంచారు. తమ బాధలు ఎవరికి చెప్పాలో తెలియక రోడ్డుపైకి వచ్చామన్నారు. మాకు అండగా ఉన్న టీచర్లను వేధించడమే కాకుండా విధుల్లో నుంచి తొలగించారన్నారు. ప్రిన్సిపాల్ వేధింపులకు ఇటీవల పీఈటీ స్వాతి మేడమ్ లెటర్ రాసి పెట్టి మరి వెళ్లిపోయారని, మాథ్స్ సార్ సతీష్ ని కూడా బయటకు పంపాలని లేనిపోని ఆరోపణలు చేసి, కుట్రలు చేస్తుందన్నారు. విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరించేందుకు తాము వచ్చామని, విచారణ చేపట్టి బాధ్యుల పై చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. అనంతరం ప్రిన్సిపాల్ సద్గుణ మేరీని విచారించారు.