సింగూరు ప్రాజెక్టులోకి స్వల్ప వరద..ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పుల్కల్ మండలంలోని సింగూరు
దిశ, చౌటకూర్ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టులోకి స్వల్ప వరద వస్తున్నది. సోమవారం ఇన్‌ఫ్లో 1895 క్యూసెక్యులు, అవుట్ ఫ్లో 391 క్యూసెక్యులు కొనసాగినట్లు అధికారులు తెలిపారు. తాలెల్మ లిఫ్ట్ ఇరిగేషన్‌కు 31 క్యూసెక్యులు, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌కు 80 క్యూసెక్కులు, మిషన్ భగరీథ కోసం 70 క్యూసెక్కులు, వృథాగా 210 క్యూసెక్కుల నీరు వెళ్తున్నట్లు తెలిపారు.గతేడాది ఇదే సమయంలో ప్రాజెక్టులో 20 టీఎంసీల నీరు ఉండగా, ప్రస్తుతం 15.646 టీఎంసీల నీరు ఉన్నట్లు ప్రాజెక్టు ఏఈ మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు ఒకటిన్నర టీఎంసీల వరద ప్రాజెక్టులో వచ్చిందన్నారు. ప్రాజెక్టులో నీటి సామర్థ్యం 20 టీఎంసీల నీరు నిల్వ ఉండకపోవడంతో సింగూరు కెనాల్ కింద సాగు చేస్తున్న వరి నాట్లకు సైతం నీటి వదలకపోతున్నట్లు అధికారులు వెల్లడించారు. సాగుకు నీటిని వదలక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.