పంచాయతీ కార్యదర్శి , గ్రామ ప్రత్యేక అధికారి, ఎంపీఓ లకు షోకాజ్ నోటీసులు

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నారాయణఖేడ్ మండలం సంజీవరావు పేట జూనియర్ పంచాయతీ కార్యదర్శి సర్వ నాగలక్ష్మి,

Update: 2024-10-14 16:25 GMT

దిశ, నారాయణఖేడ్: విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నారాయణఖేడ్ మండలం సంజీవరావు పేట జూనియర్ పంచాయతీ కార్యదర్శి సర్వ నాగలక్ష్మి, ఎంపీఓ ఇందిరమ్మ, సంజీవరావు పేట గ్రామ ప్రత్యేక అధికారి, నారాయణఖేడ్ వయోజన విద్య ప్రాజెక్ట్ అధికారి కె. వెంకట్ రెడ్డి లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు జిల్లా పంచాయతీ అధికారి సాయి బాబా ని ఆదేశించారు. నారాయణఖేడ్ మండలంలోని సంజీవరావుపేట గ్రామ పంచాయతీ పరిధిలో రక్షిత మంచినీటి సరఫరా లో నిర్లక్ష్యం కారణంగా గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శి ని జిల్లా అధికారులు సస్పెన్షన్ చేశారు.

బాధితులకు వైద్య సహాయం అందించడం, రక్షిత మంచినీరు సరఫరా కోసం ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమన్వయం చేసుకోవడం లో పంచాయతీ కార్యదర్శి విఫలం చెందడం, ప్రజలకు సురక్షితమైన మంచి నీటిని అందించడం లో విఫలం చెందడం, గ్రామ పంచాయతీ పరిధిలో రక్షిత మంచినీటి సరఫరా పనులు పర్యవేక్షించడంలో విఫలం చెందడం కారణంగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 సెక్షన్ 43 ( 5) ప్రకారం పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి, ఎంపీఓ ఇందిరమ్మ, గ్రామ ప్రత్యేక అధికారి కె .వెంకటరెడ్డి లుకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు పంచాయతీ కార్యదర్శిని సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీఓ పై, గ్రామ ప్రత్యేకాధికారి పై ఎందుకు చర్య తీసుకోకూడదు వెంటనే జిల్లా పంచాయతీ అధికారికి వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. సస్పెన్షన్ గడువు ముగిసే వరకు పంచాయతీ కార్యదర్శి హెడ్ క్వార్టర్ అందుబాటులో ఉండాలని షోకాజ్ నోటీసులో ఆదేశించారు.


Similar News