డయాలసిస్ సెంటర్ కు...మరో 5 పడకలు మంజూరు

కిడ్నీ వ్యాధి గ్రస్తులకు శుభవార్త. సిద్దిపేట డయాలసిస్ సెంటర్ కు మరో 5 పడకలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Update: 2024-10-16 13:20 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : కిడ్నీ వ్యాధి గ్రస్తులకు శుభవార్త. సిద్దిపేట డయాలసిస్ సెంటర్ కు మరో 5 పడకలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే 10 పడకల ద్వారా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సేవలు అందుతుండగా.. అదనంగా మరో 5 పడకలు మంజూరు కావడంతో కిడ్నీ వ్యాధి గ్రస్తులు వ్యయ ప్రయాసలు నుంచి ఉపశమనం లభించనుంది. సిద్దిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రత్యేక చొరవతో రాష్ట్రంలోనే తొలి డయాలసిస్ సెంటర్ 2017 లో మొదట 5 పడకలతో ప్రారంభమైంది. తదనంతరం 2019 లో మరో 5 పడకలు మంజూరు చేశారు.

గడిచిన ఏడు సంవత్సరాలుగా డయాలసిస్ సెంటర్ లో 78 వేల మంది వ్యాధి గ్రస్తులకు ఉచితంగా వైద్య సేవలందించినట్లు రికార్డుల ప్రకారం తెలుస్తోంది. ప్రస్తుత తరుణంలో కిడ్నీ వ్యాధి గ్రస్తుల సంఖ్య పెరుగుతుండటం.. మరో వైపు హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లితే వైద్యం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ప్రత్యేక చొరవ తీసుకొని డయాలసిస్ సెంటర్ కు మరో 5 పడకలను మంజూరు చేయించారు.

కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వరం : మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు

డయాలసిస్ సెంటర్ కు మరో 5 పడకలు మంజూరు కావడంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. త్వరలోనే సిద్దిపేట డయాలసిస్ సెంటర్ లో మరో 5 పడకల ద్వారా వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధి గ్రస్తులు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


Similar News