ప్రజల నిర్ణయాన్ని గౌరవించి డంపింగ్ యార్డు రద్దు చేయండి : హరీష్ రావు

ప్రజల నిర్ణయాన్ని గౌరవించి తక్షణమే డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని రద్దు చేయాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు.

Update: 2025-02-14 08:53 GMT
ప్రజల నిర్ణయాన్ని గౌరవించి డంపింగ్ యార్డు రద్దు చేయండి :  హరీష్ రావు
  • whatsapp icon

దిశ, గుమ్మడిదల :- ప్రజల నిర్ణయాన్ని గౌరవించి తక్షణమే డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని రద్దు చేయాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. గుమ్మడిదల మండలంలో డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతు జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన నిరసనకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మద్దతు తెలిపారు. ఆయనతోపాటు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. “డంపింగ్ యార్డు వల్ల ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. గుమ్మడిదల రైతులు బంగారం వంటి పంటలు పండిస్తారు. వారి భూములను మరో లగచర్లగా మార్చవద్దని” ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ తరహా పాలన అమలు చేస్తున్నారని విమర్శించారు. వందలాది స్థానికులను అన్యాయంగా అరెస్ట్ చేస్తూ, రాత్రికి రాత్రి పనులు మొదలు పెట్టడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల కోరిక మేరకు డంపింగ్ యార్డు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎయిర్ ఫోర్స్ అధికారులు సైతం ఇక్కడ డంపింగ్ యార్డు వద్దని జిల్లా కలెక్టర్ కు తెలియజేశారని అన్నారు. హైకోర్టు కూడా రెండు సార్లు పనులు ఆపాలని చెప్పినప్పటికీ, ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీ వేదికగా ఈ సమస్య పై పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవించి డంపింగ్ యార్డు ఏర్పాటును తక్షణమే రద్దు చేయాలని, లేదంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు చిమ్ముల జైపాల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, వెంకటేశం గౌడ్, కోలన్ బాల్రెడ్డి, ఆదర్శ రెడ్డి, యవ్వన గారి సంతోష్ రెడ్డి, జేఏసీ నాయకులు, రైతు సంఘాల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


Similar News