పీస్ కమిటీ మీటింగులు ఏర్పాటు చేయాలి
వినాయక చవితి, గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగల సందర్భంగా పీస్ కమిటీ మీటింగులు ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ అనురాధ అధికారులను ఆదేశించారు.
దిశ, సిద్దిపేట ప్రతినిధి : వినాయక చవితి, గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగల సందర్భంగా పీస్ కమిటీ మీటింగులు ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ అనురాధ అధికారులను ఆదేశించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పెండింగ్ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసుల గురించి ఏసీపీ, సీఐ, ఎస్ఐలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ...గణేష్ మండపాల ఏర్పాటు నుంచి వినాయక నిమజ్జనం వరకు నిర్వాహకులు, అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రమాదాలు జరిగిన ప్రదేశంలో వివిధ డిపార్ట్‌మెంట్ అధికారులతో కలిసి తగు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసులను వెంటనే డిస్పోజల్ చేయాలని సూచించారు. గంజాయి కేసులలో ఉన్న నిందితులపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయాలని సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, పేకాట, జూదం తదితర వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఉక్కు పాదంతో అణిచి వేయాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించే వారిపై శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏసీపీలు మధు, పురుషోత్తం రెడ్డి, టాస్క్ ఫోర్స్ ఏసీపీ రవీందర్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్, సీఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 15 వరకు ..సిటీ పోలీస్ యాక్ట్ అమలు
పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెప్టెంబర్ 15 తేదీ వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలన్నారు.
బంద్ ల పేరిట వివిధ కారణాలు చూపుతూ బలవంతంగా సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. దీనికి తోడు కమిషనరేట్ పరిధిలో డీజే సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు సెప్టెంబర్ 15వ తేదీ వరకు అమలులో ఉంటుందన్నారు. పై నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ హెచ్చరించారు.