ఎన్‌హెచ్ఎం ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి

ఎన్‌హెచ్ఎం పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ పెండింగ్‌లో ఉన్న వేతనాలు ఇవ్వాలని వేతనాలు రాక ఇబ్బంది పడుతున్న ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని మెడికల్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం. యాదగిరి కోరారు.

Update: 2024-03-12 12:07 GMT

దిశ, సంగారెడ్డి : ఎన్‌హెచ్ఎం పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ పెండింగ్‌లో ఉన్న వేతనాలు ఇవ్వాలని వేతనాలు రాక ఇబ్బంది పడుతున్న ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని మెడికల్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం. యాదగిరి కోరారు. మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక డీఎం అండ్ హెచ్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం డీఎంఅండ్ హెచ్ఓ గాయత్రి దేవికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మెడికల్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం. యాదగిరి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలలో ఎన్‌హెచ్ఎం పరిధిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్, ఏఎన్ఎం, సెకండ్ ఏఎన్ఎంలకు గత 3 నెలల నుండి వేతనాలు రాక ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.

వేతనాలు రాకపోవడంతో అనేక మంది ఉద్యోగులు ఇబ్బందికి గురవుతున్నారని, ఈ ఉపాధి మీదనే ఆధారపడి జీవిస్తున్న ఉద్యోగులకు ఇప్పటివరకు వేతనాలు రాకపోవడం చాలా దారుణమన్నారు. ఉద్యోగులందరికీ రూ. 5 లక్షల ఆరోగ్య బీమా అమలు చేయాలని 2021 నుంచి 30% పీఆర్సీ బకాయిల విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులందరికీ తదుపరి పీఆర్సీలో 40% పెంపు పెంచాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యోగులందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ యూనియన్ సంగారెడ్డి బ్రాంచ్ అధ్యక్షులు రాజు, కార్యదర్శి వినోద్, కోశాధికారి ఇమ్రాన్, నాయకులు రాజేష్, రాము, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Similar News