మున్సిపాలిటీల్లో ఓఆర్ఆర్ గ్రామాల విలీనం

హైదరాబాద్ మహానగరానికి ఆనుకొని ఉన్న 51 శివారు గ్రామాలను పక్కన ఉన్న మున్సిపాలిటీలలో చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Update: 2024-09-04 02:59 GMT

దిశ, పటాన్ చెరు : హైదరాబాద్ మహానగరానికి ఆనుకొని ఉన్న 51 శివారు గ్రామాలను పక్కన ఉన్న మున్సిపాలిటీలలో చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో పటాన్ చెరు నియోజకవర్గంలోని పదకొండు గ్రామాలను అమీన్ పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీలలో విలీనం చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం అమీన్ పూర్ మండలంలోని ఆరు గ్రామాలను అమీన్ పూర్ మున్సిపాలిటీలో విలీనం చేయగా, పటాన్ చెరు మండల పరిధిలోని ఐదు గ్రామాలను తెల్లాపూర్ మున్సిపాలిటీలో విలీనం చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 11 గ్రామాలను సమీప మున్సిపాలిటీలో చేర్చుతూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయగా, గ్రామ పంచాయతీలను డి నోటిఫై చేస్తూ పంచాయతీ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. సమీప మున్సిపాలిటీల్లో శివారు గ్రామాలను విలీన ప్రక్రియ పూర్తి కావడంతో రెండు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ పూర్తి విలీన ప్రక్రియ పూర్తయితే మహానగర విస్తీర్ణం పెరగడంతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందనే ఆలోచనతో సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఆరు పంచాయతీలు అమీన్ పూర్ మున్సిపాలిటీలోకి..

అమీన్ పూర్ మండల పరిధిలోని కిష్టారెడ్డిపేట, పటేల్ గూడా, ఐలాపూర్, ఐలాపూర్ తాండ,సుల్తాన్ పూర్, దయారా గ్రామపంచాయతీలను అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.కొత్తగా చేరుతున్న గ్రామాలను 24 వార్డులుగా విభజించారు. ఇప్పటికే అమీన్ పూర్ మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా,కొత్తగా చేరిన గ్రామలతో వార్డుల సంఖ్య 48 కి చేరనుంది. పటాన్ చెరు ఐదు గ్రామాలు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోకి..రామచంద్రాపురం మండల పరిధిలోని తెల్లాపూర్, కొల్లూర్, వెలిమల, ఈదుల నాగులపల్లి గ్రామాలతో మున్సిపాలిటీగా ఆవిర్భవించిన తెల్లాపూర్ మున్సిపాలిటీ లోకి పటాన్ చెరు మండల పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుకు అనుకుని ఉన్న ఐదు గ్రామాలను కలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. పటాన్ చెరు మండలంలోని ముత్తంగి, పోచారం, పాటి ఘనపూర్, కర్దనూరు గ్రామాలను తెల్లాపూర్ మున్సిపాలిటీ లోకి విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 17 వార్డులున్న తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి కొత్తగా జత కానున్న గ్రామాల 17 వార్డు లతో కలిపి 34 వార్డులు కానున్నాయి.

తగ్గనున్న మండలాల పరిధి..

అమీన్ పూర్ మండల పరిధిలోని ఆరు గ్రామపంచాయతీలు, పటాన్ చెరు మండలంలోని ఐదు గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మండలాల పరిధి తగ్గనుంది. పటాన్ చెరు మండల పరిధిలోని చిట్కుల్, ఇస్నాపూర్, పాశం మైలారం నందిగామ బచ్చుగుడా గ్రామాలను విలీనం చేసి నూతన మున్సిపాలిటీ గా రూపాంతరం చెందుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ కొత్త మున్సిపాలిటీ ఆవిర్భవిస్తే పటాన్ చెరు మండల పరిధిలో కేవలం 9 గ్రామాలు ఇంద్రేశం,రామేశ్వరం బండ, పెద్ద కంజర్ల, చిన్న కంజర్ల,ఐనోల్, రుద్రారం, లక్డారం, భానూర్, క్యాసారం గ్రామాలు మాత్రమే గ్రామ పంచాయతీలుగా కొనసాగనున్నాయి. అమీన్ పూర్ లోని 6 గ్రామాలు విలీనం కావడంతో కేవలం వడక్ పల్లి, జనాకం పేట్ గ్రామాలు మాత్రమే మండలంలో గ్రామ పంచాయతీలుగా మిగలనున్నాయి. ఈ రెండు గ్రామాలను పటాన్ చెరు లేదా జిన్నారం మండలంలో విలీనం చేస్తారని వార్తలు వెలువడుతున్నాయి. త్వరలో ఈ రెండు గ్రామాల భవితవ్యంపై సర్కార్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.


Similar News