పంజాబీ డాబాలపై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల దాడులు

మాసాయిపేట మండలం లో షేర్ పంజాబీ డాబాపై గురువారం సంగారెడ్డి ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ వీణ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు.

Update: 2024-11-21 14:39 GMT

దిశ,వెల్దుర్తి : మాసాయిపేట మండలం లో షేర్ పంజాబీ డాబాపై గురువారం సంగారెడ్డి ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ వీణ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. దాబాలో తమ సిబ్బందిచే తనిఖీలు చేయగా ఓపియం ఎరన్ ముడి పదార్థం 128 గ్రాములు స్వాధీనం చేసుకున్నట్లు ఆమె తెలిపారు. రాజస్థాన్ రాష్ట్రంలో పండించే ఈ పంట చిన్న కాయల రూపంలో ఉంటుందని, దాంట్లో నుంచి ముడి పదార్థం చేసి విక్రయాలు చేపడుతున్నట్లు సీఐ అన్నారు. ముడి పదార్థాల సరుకులను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లారీల ద్వారా రవాణా చేసి విక్రయాలను చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ పదార్థాన్ని టీలో గాని, ఇతర వాటిలో వేసుకుని సేవిస్తే మత్తు వస్తుందని సీఐ తెలిపారు. బుధవారం సాయంత్రం మనోహరాబాద్ మండలం కళాకల్లోని దీపక్ యూపీ డాబాలో తనిఖీలు చేయగా రెండు కిలోల మూడు వందల గ్రాముల ఓపియం ఎరన్ ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. పదార్థాన్ని అమ్మేందుకు డాబాల యజమాని వద్ద ఎలాంటి అనుమతులు లేకపోవడంతో ఎన్డిపిఎస్ యాక్ట్ 1985 ద్వారా కేసు నమోదు చేసి మాసాయి పేట దాబా యజమాని రవీందర్ సింగ్ ను అరెస్ట్ చేసి రామాయంపేట ఎక్సైజ్ సర్కిల్ కు అప్పగించామన్నారు. అలాగే కళా కాల్ దాబా యజమాని పై కేసు నమోదు చేశామని, ఇప్పటికైన డాబా యజమానులు ఇలాంటి విక్రయాలను మానుకోవాలని లేకుంటే కేసులు తప్పవని హెచ్చరించారు. తనిఖీలలో ఎస్సై అనిల్, హెడ్ కానిస్టేబుల్ ఆజం, కానిస్టేబుల్ ఉమారాణి, గోపాల్, సిబ్బంది పాల్గొన్నారు.


Similar News