MLA : జిల్లాలోనే అత్యధికంగా వరి ధాన్యం పండించేది దుబ్బాక నియోజకవర్గం

గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి జిల్లాలోనే అత్యధికంగా వరి ధాన్యం పంట పండించేది దుబ్బాక నియోజకవర్గం అని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.

Update: 2024-10-14 11:19 GMT

దిశ,దుబ్బాక : గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి జిల్లాలోనే అత్యధికంగా వరి ధాన్యం పంట పండించేది దుబ్బాక నియోజకవర్గం అని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత వర్షాకాలం కంటే ఈసారి నియోజకవర్గంలో ఎక్కువగా వరి ధాన్యాన్ని పండించారన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలలో ఈసారి 30,40 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లతో మండల అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తూ పంట పండించిన ఏ రైతుకు ఇబ్బందులు లేకుండా చూశామన్నారు.

అలాగే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దృష్టిలో పెట్టుకొని వారికి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ప్రధానంగా రైతుల విషయంలో అధికారులు అశ్రద్ధ వహించద్దన్నారు.ఐకేపీ కొనుగోలు కేంద్రాలలో రైతులు ఇబ్బంది పడకుండా లారీల కొరత లేకుండా చూడాలని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లో మొట్టమొదటిసారిగా అప్పనపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. అప్పనపల్లి అంటేనే నూటికి 90 శాతం రైతులు వరి ధాన్యం పంట పండించడం జరుగుతుందన్నారు.

ఇంతకు ముందు సాగునీటి కోసం రైతన్నలు బోరు, బావులు తవ్వించి అప్పులపాలై వాటిని తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. మల్లన్న సాగర్‌ ద్వారా కరువు అనే పదం కనిపించకుండా శాశ్వత పరిష్కారం లభించిందని, కాల్వల ద్వారా గోదావరి పరవళ్లు చూస్తుంటే నియోజకవర్గ రైతుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయని అని అన్నారు. దుబ్బాక నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడడం తప్ప ఇక్కడ ఏదో పరిశ్రమలు మీద ఆధారపడి లేరన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మల్లన్న సాగర్ కొండపోచమ్మ రంగనాయక సాగర్ ప్రాజెక్టు లు రావడం వాటి పనులు పూర్తి అయి జిల్లా ప్రజలకు నీరును అందించడం జిల్లా రైతుల అదృష్టమన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి గిట్టుబాటు ధర పొందాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య పీఏసిఏస్ చైర్మన్ శేర్ల కైలాసం,మాజీ జెడ్పిటిసి కడతల రవీందర్ రెడ్డి, ఎంపీడీఓ భాస్కర శర్మ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News