యథేచ్చగా ఉల్లంఘనలు.. నివాసం పేరిట అనుమతి.. కానీ వాణిజ్య భవనాల నిర్మాణం

అనుమతులకు పూర్తి విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనం నిర్మించినా.. రెసిడెన్షియల్ భవనం పేరిట అనుమతి తీసుకొని కమర్షియల్ భవనం నిర్మిస్తున్నా.. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.

Update: 2024-03-13 10:49 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : అనుమతులకు పూర్తి విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనం నిర్మించినా.. రెసిడెన్షియల్ భవనం పేరిట అనుమతి తీసుకొని కమర్షియల్ భవనం నిర్మిస్తున్నా.. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కళ్ల ముందే అక్రమ నిర్మాణాలు కనిపిస్తున్నా, అక్రమ కట్టడాలపై ఎవరైన ఫిర్యాదు చేసినా టౌన్ ప్లానింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. సిద్దిపేట పురపాలక సంస్థ పరిధిలో మొత్తం 43 వార్డులు ఉండగా దాదాపు లక్ష మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. అపార్ట్‌మెంట్లు, భవన నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. వ్యాపారాల నిమిత్తం పెద్ద పెద్ద షోరూంలు వెలుస్తున్నాయి. అయితే వీటి నిర్మాణాలు ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు జరగాల్సి ఉండగా.. పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణంలోని మెదక్ రోడ్డులో ఓ యజమాని ఇంటి నిర్మాణం కోసం అనుమతి తీసుకుని ప్రస్తుతం వ్యాపార సముదాయాలు నిర్మించారు. అనుమతి తీసుకున్న దానికి భిన్నంగా వ్యాపార సముదాయం నిర్మించినా.. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు.

అదే విధంగా పట్టణంలోని బఫర్ జోన్ లో నిబంధనలకు విరుద్దంగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణాలు జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విషయమై అధికారులను ఆరా తీస్తే రెవెన్యూ అధికారుల సర్వేకు అనుగుణంగానే అనుమతులు జారీ చేసినట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే నిర్మాణాలు మాత్రం బఫర్ జోన్‌లో కొనసాగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. అదే విధంగా నిబంధనలకు విరుద్దంగా తక్కువ విస్తీర్ణంలో స్టీల్ట్ ఏరియా పేరిట అనుమతి తీసుకొని సెల్యూలార్, బహుళ అంతస్తులు నిర్మిస్తున్నా, ఇండస్టీయల్ జోన్‌లో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు జరుగుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో విమర్శ పాలవుతున్నారు. దీనికితోడు సెట్ బ్యాక్ నిబంధనలకు విరుద్దంగా అనేక చోట్ల రోడ్లు, వీధులను సైతం ఆక్రమించి నిర్మాణాలు కొనసాగుతుండటంతో రోడ్డు వెడల్పు తగ్గిపోయి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.

ఫిర్యాదులు బుట్టదాఖలు..

పట్టణంలో నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు కొనసాగుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. నిబంధనలు బుట్టదాఖలు చేస్తూ చెపడుతున్న నిర్మాణాల్లో అనుకొని ప్రమాదం జరిగితే భారీ ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పట్టణంలోని ఓ ప్రాంతంలో రెసిడెన్షియల్ పేరిట అనుమతి తీసుకొని వ్యాపార సముదాయం నిర్మించారని సదరు వార్డు కౌన్సిలర్ కౌన్సిల్ సమావేశంలో అధికారులను నిలదీసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ విషయమై టౌన్ ప్లానింగ్ అధికారిని వివరణ కోరగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన విషయం దృష్టికి వచ్చిందని సదరు నిర్మాణదారుడికి నోటీసులిచ్చిన ట్లు తెలిపారు.

అనధికార కట్టడాలపై చర్యలు తప్పవు : మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి

అనధికార కట్టడాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి చర్యలు చేపడుతాం. అనుమతి తీసుకున్న మేరకు నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడకుండా నిర్మాణాలు చేపట్టాలి. అనుమతులను విరుద్దంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.


Similar News