వాడి వేడిగా సర్వ సభ్య సమావేశం..మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన

సిద్దిపేట మున్సిపల్ సర్వసభ్య సమావేశం వాడి వేడిగా సాగింది.

Update: 2024-08-27 10:59 GMT

దిశ,సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట మున్సిపల్ సర్వసభ్య సమావేశం వాడి వేడిగా సాగింది. మున్సిపల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మున్సిపాలిటీ నిధుల మళ్లీ పు పై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం సభ్యులు సమావేశం బై కాట్ చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట విపక్ష సభ్యులు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కౌన్సిలర్లు సాకి బాల్ లక్ష్మీ ఆనంద్, రియాజ్, ఆలకుంట కవిత, పయ్యావుల పూర్ణిమ ఎల్లం యాదవ్, ముత్యాల శ్రీదేవి బుచ్చిరెడ్డి, బీజేపీ కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్, ఎంఐఎం కౌన్సిలర్ మహ్మద్ అబ్దుల్ నసీర్ మాట్లాడుతూ... పట్టణ ప్రగతి నిధులు ఇతర కార్యక్రమాలకు మళ్లించడం దారుణమన్నారు. కుల సంఘాల నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని.. కుల సంఘాల నిర్మాణానికి ఎమ్మెల్యే హామీ ఇచ్చినందున ఎమ్మెల్యే నిధుల నుంచి మంజూరు చేయించాలన్నారు.

అలా కాకుండా మున్సిపల్ నిధులు మళ్లించడం మూలంగా పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ బల్దియా నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే ఏజెండా అంశాలపై చర్చ ప్రారంభం కాకముందే విపక్ష పార్టీల కౌన్సిలర్లు వాకౌట్ చేయడం పై బీఆర్ఎస్ కౌన్సిలర్లు అసహనం వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధులు, ఇటీవల పట్టణంలో ఓ చిన్నారి డెంగీ వ్యాధి బారిన పడి మృతి చెందిన అంశాలపై చర్యలో పాల్గొన కుండా విపక్ష పార్టీ ల కౌన్సిలర్లు వెళ్లిపోవడం దురదృష్ట కరమని మున్సిపల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు అన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, కౌన్సిలర్లు ధర్మవరం బ్రహ్మం, సాయన్న గారి సుందర్, కలకుంట్ల మల్లికార్జున్, బర్ల మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ ప్రేరణ, అధికారులు పాల్గొన్నారు.

* టౌన్ ప్లానింగ్ అధికారుల సరండర్ కు తీర్మానం

టౌన్ ప్లానింగ్ విభాగంలో అక్రమాలపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు సర్వసభ్య సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సర్వసభ్య సమావేశంలో డీపీఓ దేవరాజ్ తీరు మార్చుకోవాలని సభ్యులు హెచ్చరించిన తీరు మార్చుకోని నేపథ్యంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి టీపీఓ దేవరాజ్ ను డీపీ సీపీకి సరండర్ చేయాలని ఈమేరకు తీర్మానం చేశారు. గత సర్వసభ్య సమావేశంలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ, అనధికారిక బిల్డింగ్ పర్మిషన్, కోర్టు వివాదంలో ఉన్న స్థలాలను బిల్డింగ్ నిర్మాణానికి అనుమతుల పై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Similar News