రెండేళ్లుగా నిర్ధారించని రెవెన్యూ శాఖ..!
కొండాపూర్ లో అక్రమంగా ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేశారని గ్రామస్తులు రెండేళ్లుగా పోరాటం చేస్తున్నారు. గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమిని అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారని ఆందోళనలు నిర్వహించారు. అప్పటి కలెక్టర్ రాజర్షి షా, ప్రస్తుత కలెక్టర్ రాహుల్ రాజ్ తో పాటు అప్పటి ప్రభుత్వ మంత్రులు, ప్రస్తుత ప్రభుత్వ మంత్రులు, ఎంపీ లకు కొండాపూర్ లో ఉన్న సర్కారు భూములను కాపాడాలని వినతి పత్రాలు అందజేశారు. కోట్ల విలువైన భూమిని కాజేసిన వారినుంచి రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. కానీ ఒక వైపు గ్రామస్తులు ఆందోళనలు చేసి అడ్డుకుంటున్నా మారో వైపు వివాదాస్పద భూముల్లో ప్రైవేట్ వ్యక్తులు ప్రహారి నిర్మాణం చేపడుతున్నారు. గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం బోర్డును సైతం కూల్చి వేసే ప్రయత్నం చేసినట్టు స్థానికులు తెలిపారు.
బ్లాక్ లో వివాదాస్పద రిజిస్ట్రేషన్...!
కొండాపూర్ లో 144 సర్వే నంబర్ లో అక్రమంగా జరిగిన రిజిస్ట్రేషన్ లను బ్లాక్ లో పెడతామని జిల్లా అధికారులు హామీ ఇచ్చిన ఆచరణలోకి మాత్రం రాలేదు. కొండాపూర్ లో ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు పట్టా చేయడంపై దిశ పత్రికలో వచ్చిన కథనానికి అప్పటి అడిషనల్ కలెక్టర్ రమేష్ స్పందించి కొండాపూర్ లోని వివాదాస్పదంగా మారిన భూమి రిజిస్ట్రేషన్ ను బ్లాక్ లో పెడతామని ప్రకటించారు. దీనితో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ కొన్ని నెలల తరవాత అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలకు బదిలీ కావడం తో ఇచ్చిన హామీ అమలు కాలేదు. దీనితో కొండాపూర్ గ్రామస్తులు అప్పటి కలెక్టర్ రాజర్షి షాకు ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ ఆ భూమిని బ్లాక్ లో పెట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కానీ కలెక్టర్ చెప్పినా ఆచరణలోని రాలేదు.
చక్రం తిప్పుతున్న పెద్దలు..?
కొండాపూర్ లో ప్రభుత్వ భూమి అక్రమంగా పట్టాగా మార్చిన వైనం పై గ్రామస్తులు అలుపెరుగని పోరాటం చేస్తున్నా వెనకాల పెద్దల హస్తం అక్రమార్కులకు అండగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఊరంతా కలిసి ప్రభుత్వ భూమిని కాపాడేందుకు ఒక వైపు పోరాటం చేస్తుంటే వెనకాల పెద్దలు అధికారులపై ఒత్తిడి తెచ్చి ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కలెక్టర్ లేఖ రాశాం
చంద్రశేఖర్ రెడ్డి, తహశీల్దార్, మనోహారాబాద్
కొండాపూర్ లోని సర్వే నంబర్ 144 లో ప్రస్తుతం తమ వద్ద ఉన్న రికార్డులు మాత్రం పట్టా భూమిగా ఉంది. కానీ గతంలో సర్కారు భూమి గా రికార్డుల్లో ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. కానీ తమ వద్ద పాత రికార్డులు లేవు. దీని వల్ల పట్టా భూమా ప్రభుత్వ భూమా అనేది నిర్ధారణ చేయాలని ఆర్డీవో ద్వారా జిల్లా కలెక్టర్ కు లేఖ రాశాం.. జిల్లా కలెక్టర్ నుంచి వచ్చిన దాన్ని బట్టి చర్యలు తీసుకుంటాం.