110 కిలోల ఎండు గంజాయి స్వాధీనం
హైదరాబాద్ నుంచి ముంబాయికి అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 110 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు.
దిశ, సంగారెడ్డి : హైదరాబాద్ నుంచి ముంబాయికి అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 110 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. శుక్రవారం సంగారెడ్డిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. జహీరాబాద్ సబ్-డివిజన్ పోలీసులు నిర్వహించిన మెగా వెహికల్ చెకింగ్ లో సుమారు 30 లక్షల విలువ గల 110 కిలోల నిషేదిత ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నమ్మదగిన సమాచారం శుక్రవారం తెల్లవారుజామున జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శివలింగం, టౌన్ ఎస్ఐ కాశీనాథ్, రూరల్ ఎస్ఐ ప్రసాద్ రావ్, చిరాగ్ పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి, సబ్-డివిజన్ సిబ్బందితో కలిసి జహీరాబాద్ శివారులో గల పాత ఆర్టీవో చెక్ పోస్ట్ సమీపంలో ఎన్.హెచ్.65 బై పాస్ రోడ్డు పై మెగా వెహికిల్ చెకింగ్ చేస్తుండగా హైదరాబాద్ నుంచి ముంబై వైపు వెళ్తున్న ఒక కారును ఆపడానికి ప్రయత్నించగా ఆ కార్ డ్రైవర్ తన కారును ఆపకుండా పారిపోతూ… కొద్ది దూరం వెళ్ళి కారును వదిలి అందులో ముగ్గురు వ్యక్తులు పారిపోగా, ఇద్దరు వ్యక్తులు పట్టుకోవడం జరిగిందని తెలిపారు.
జహీరాబాద్ శాంతి నగర్ కు చెందిన మహమ్మద్ అక్బర్, మహమ్మద్ సల్మాన్ లను అరెస్టు చేయగా, వీరి అన్న ఇస్మాయిల్ అతని అనుచరులు మహబూబ్, రజాక్ లు పరారీలో ఉన్నారని తెలిపారు. అక్రమంగా గంజాయి తరలింపును నవాజ్, షబ్బీర్ ల ఆదేశానుసారం, వారు ఇచ్చిన మారుతి షిఫ్ట్ కార్ నెంబర్ ఎంహెచ్43ఎక్స్4796 గల దానిలో ఒరిస్సా బోర్డర్ ఉండి 110 కిలోల ఎండు గంజాయిని తీసుకొని వస్తూ ఉండగా, నవాజ్, షబ్బీర్ ముందు సిల్వర్ కలర్ ఇన్నోవా కారులో సిగ్నల్ ఇస్తూ వెళ్తుండగా వారిని వెంబడిస్తూ ముంబైకి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు. మెగా వెహికిల్ చెకింగ్ లో 110 కిలోల ఎండు గంజాయి, ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం జరిగిందని, సీజ్ చేసిన గంజాయి 27-ప్యాకెట్లు, ఒక్కొక్క ప్యాకెట్ సుమారు 4-కిలోలు ఉంటుందన్నారు.
అరెస్టు చేసిన ఇద్దరు వ్యక్తుల నుండి రెండు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని, జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్ కు తరలించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో మాదకద్రవ్యాల దుర్వినియోగం పై జిల్లా పోలీసు శాఖ ఉక్కుపాదం మోపడం జరుగుతుందని, ఎవరైనా గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలను సాగు, సరఫరా చేసిన సంగారెడ్డి జిల్లా ఎస్ న్యాబ్ నెంబర్ 8712656777 కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ ఎ.సంజీవ రావ్, జహీరాబాద్ డీఎస్పీ రామ్ మోహన్ రెడ్డి, టీ న్యాబ్- డీఎస్పీ పుష్పన్ కుమార్, జహీరాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ శివలింగం, ఎస్సై కాశీనాథ్, ప్రసాద్ రావ్ సిబ్బంది తదితరులు ఉన్నారు.