హెచ్‌సీఏ టీ20 లీగ్ విజేతగా మెద‌క్‌.. ఫైనల్లో ఓడిన కరీంనగర్

హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) నిర్వహించిన‌ అంత‌ర్ జిల్లాల టీ20 క్రికెట్ టోర్నమెంట్ ట్రోఫీను మెద‌క్ జిల్లా జ‌ట్టు కైవ‌సం

Update: 2024-05-29 16:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) నిర్వహించిన‌ అంత‌ర్ జిల్లాల టీ20 క్రికెట్ టోర్నమెంట్ ట్రోఫీను మెద‌క్ జిల్లా జ‌ట్టు కైవ‌సం చేసుకోగా, క‌రీంన‌గ‌ర్ ర‌న్నర‌ప్‌గా నిలిచింది. బుధ‌వారం ఉప్పల్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్లో టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్‌కు దిగిన మెద‌క్ 20 ఓవ‌ర్లలో 168/4 స్కోరు చేసింది. ల‌క్ష్య ఛేద‌న‌లో క‌రీంన‌గ‌ర్ 20 ఓవ‌ర్లలో 145/6 స్కోరు చేసి, ఓట‌మి పాలైంది. మెద‌క్ జ‌ట్టు 23 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. మెదక్‌ బ్యాట‌ర్ మహ్మాద్ అఫ్రీది అర్ధ సెంచ‌రీ చేశాడు. 40 బంతుల్లో 7 సిక్స్‌లు, 2 ఫోర్ల స‌హాయంతో 80 ప‌రుగులు రాణించాడు. అఫ్రీదికి హెచ్‌సీఏ అధ్యక్షుడు జ‌గ‌న్‌మోహ‌న్‌రావు రూ.50 వేలు న‌గ‌దు బ‌హుమ‌తి అందించారు.

ఈ వేడుక‌ల్లో జ‌గ‌న్‌మోహ‌న్‌రావు మాట్లాడుతూ.. ఏడాదిలానే ప్రతి ఏటా రాష్ట్ర వ్యాప్తంగా స‌మ్మర్ క్యాంప్ నిర్వహించి, ఆ వెంట‌నే అంత‌ర్ జిల్లాల టీ20 టోర్నీని నిర్వహిస్తామ‌ని చెప్పారు. అపెక్స్ కౌన్సిల్‌లో చ‌ర్చించి, త్వర‌లోనే ఈ టోర్నీకి ఒక దిగ్గజ క్రికెట‌ర్ పేరు పెడ‌తామ‌ని తెలిపారు. హైద‌రాబాద్‌లో శాటిలైట్ అకాడమీల ఏర్పాటుతో పాటు జిల్లాల నుంచి వ‌చ్చే క్రికెట‌ర్లకు ఇక్కడ శిక్షణ‌, వ‌స‌తి స‌దుపాయం క‌ల్పించే విష‌య‌మై కూడా అపెక్స్‌లో చ‌ర్చించి, త్వర‌లో ఒక మంచి నిర్ణయం తీసుకుంటామ‌ని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు ద‌ల్జిత్ సింగ్‌, స‌హాయ కార్యద‌ర్శి బ‌స‌వ‌రాజు, కోశాధికారి సీజే శ్రీనివాస్‌, సీఈఓ సునీల్, క‌రీంన‌గ‌ర్ జిల్లా క్రికెట్ సంఘం కార్యద‌ర్శి ఆగంరావు, మెద‌క్ జిల్లా క్రిక‌ట్ సంఘం కార్యద‌ర్శి రాజేంద‌ర్ రెడ్డి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.


Similar News